Jun 02,2023 21:15

న్యూఢిల్లీ : అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఎడబ్ల్యుఎస్‌) ఇండియా హెడ్‌ పునీత్‌ చండోక్‌ రాజీనామా చేశారు. భారత్‌లో క్లౌడ్‌ సేవల మౌలిక వసతులపై 2030 నాటికి 12 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెడతామని ఇటీవల ఆ కంపెనీ ప్రకటించింది. ఈ సమయంలో పునీత్‌ రాజీనామా చేయడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఆయన ఎప్పటి నుంచి వైదొలగనున్నారో కూడా తెలియాల్సి ఉంది. పునీత్‌ స్థానంలో ఆసంస్థ గ్లోబల్‌ బిజినెస్‌ హెడ్‌ వైశాలి కస్తూరి తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం.

  • అమెజాన్‌ పదేళ్ల వేడుకలు

అమెజాన్‌ ఇండియా 10 ఏళ్ల వేడుకలను జూన్‌ 5న నిర్వహించుకోనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ముంబయి కేంద్రంగా కేవలం 100 మంది విక్రేతలతో ప్రారంభమై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని పిన్‌కోడ్‌లలో వినియోగదారులకు అనేక రకాల ఉత్పత్తులను అందిస్తున్నట్లు తెలిపింది. అత్యంత మారుమూల ప్రాంతాలతో సహా చిన్న వ్యాపారాలను డిజిటల్‌గా వేదికపైకి తీసుకురావడంపై అమెజాన్‌ దృష్టి సారించినట్లు తెలిపింది. ''10వ వార్షికోత్సవ వేడుకల సందర్బంగా కోట్లాది మంది వినియోగదారులు, విక్రేతల కోసం కొత్త ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్నాము. వార్షికోత్సవం సందర్బంగా పలు డిస్కౌంట్లు అందిస్తున్నాము. మేము ఒక్క కోటి ఎస్‌ఎంబిలను డిజిటలైజ్‌ చేయడం, ఇ-కామర్స్‌ ఎగుమతుల్లో 20 బిలియన్‌ డాలర్ల వ్యాపారానికి చేరుకోవడం, 2025 నాటికి 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.'' అని అమెజాన్‌ ఇండియా కన్య్సూమర్‌ బిజినెస్‌ కంట్రీ మేనేజర్‌ మనీష్‌ తివారీ పేర్కొన్నారు.