Sep 23,2023 21:16
  • ముఖ్య అతిథిగా హాజరైన జింగ్‌ పింగ్‌
  • త్రివర్ణ పతకాన్ని మోసిన హర్మన్‌, లవ్లీనా

హాంగ్జౌ(చైనా): ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్‌ ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. చైనాలోని హాంగ్జౌలో శనివారం జరిగిన ప్రారంభోత్సవాల్లో కనులు మిరుమిట్లు గొలిపే లేజర్‌ షో, అబ్బుర పరిచే సాంస్కృత్రిక కార్యక్రమాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. హాంగ్జూ ఒలింపిక్‌ స్పోర్ట్స్‌ సెంటర్‌ స్టేడియంలో సంప్రదాయ నత్య ప్రదర్శనలు అహూతులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు చైనా అధ్యక్షులు జింగ్‌-పింగ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసారు. భారత త్రివర్ణ పతకాన్ని హర్మన్‌, లవ్లీనా బోర్గోహైన్‌ చేబూని అథ్లెట్ల ముందు నడిచారు. ఈసారి ఆసియా క్రీడల్లో 655మంది అథ్లెట్లతో కూడిన భారీ బృందం పయనమైంది. ఇక ఆతిథ్య చైనానుంచి 886మంది అథ్లెట్లు పతకాలకు పోటీపడుతున్నారు. మొత్తం 45దేశాల నుంచి 12వేలకు పైగా అథ్లెట్లు ఈసారి ఆసియా క్రీడల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 61 క్రీడాంశాల్లో మొత్తం 481 స్వర్ణ పతకాలు అథ్లెట్లకు దక్కనున్నాయి. ఆసియా క్రీడల పతకాల పట్టికలో ప్రతిసారీ చైనా అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ క్రీడలకు చైనా ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. హాంగ్జౌతోపాటు హుజౌ, నింగ్సో, షావోజింగ్‌, జిన్హువా, వెంజౌతోపాటు మొత్తం 44 వేదికల్లో పోటీలు జరగనున్నాయి.

భారత పతాక ధారులుగా హర్మన్‌, లవ్లీనా..

పరేడ్‌ సమయంలో స్టార్‌ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహైన్‌, హాకీ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ భారత బృందానికి ముందు నడిచారు. వీళ్లిద్దరితో పాటు క్రీడాకారులంతా జాతీయ జెండాలు చేతబూని జయ జయ ధ్వానాలు చేశారు. ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ తాత్కాలికి అధ్యక్షడు రణధీర్‌ సింగ్‌ భారత అథ్లెట్లతో నడిచారు. ఈసారి భారత్‌ భారీ బృందంతో బరిలోకి దిగుతోంది. 61 క్రీడాంశాలకు గాను 41 విభాగాల్లో భారత్‌ పతకాల కోసం పోటీ పడుతోంది. 2018లో ఇండోనేషియాలోని జకార్తా వేదికగా జరిగిన 18వ ఆసియా క్రీడల్లో భారత్‌ 70 పతకాలు (16స్వర్ణాలు, 23రజతాలు, 31కాంస్యాలు) సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. బాక్సింగ్‌లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌, జావెలిన్‌లో నీరజ్‌ చోప్రా, టేబుల్‌ టెన్నిస్‌లో ఆకుల శ్రీజ పతకాలు గెలిచే సత్తా ఉన్నవాళ్లే. పురుషుల, మహిళల క్రికెట్‌కు ఈసారి ఆసియా క్రీడల్లో చోటు దక్కాయి. ఈసారి భారత్‌ సెంచరీ పతకాలపై గురిపెట్టి ఆసియా క్రీడల బరిలో దిగింది.

2

 

3

 

2

 

8