12 ఏళ్లలో 4.4 రెట్లు పెరిగిన సంఖ్య
ఏడాదిలో రెట్టింపైన పలువురి సంపద
అదానీని వెనక్కి నెట్టిన అంబానీ
గౌతంకు హిండెన్‌బర్గ్ మర్చిపోని దెబ్బ
ప్రతీ 20 రోజులకు ఇద్దరు కొత్త బిలియనీర్లు
హురున్ రిచ్ లిస్ట్ -2023 వెల్లడి
న్యూఢిల్లీ : భారత్‌లో సామాన్యులు ఆదాయాలు లేక.. అధిక ధరలతో విలవిలలాడుతోంటే.. మరోవైపు కుబేరులు మాత్రం ఊహించని రీతిలో పెరిగిపోతున్నారు. సంఖ్యా, ఆదాయ పరంగాను భారీగా పెరిగారు. ఏడాదికేడాదికి వేల కోట్లు పోగేసుకుంటున్నారని హురున్ రిస్ట్ లిస్ట్ రిపోర్ట్‌తో వెల్లడయ్యింది. మంగళవారం నాడు ''360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023'' పేరుతో హురున్ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. క్రితం ఏడాది ఈ సంఖ్య 24గా ఉంది. ఆగస్టు 30 నాటి సంపద ఆధారంగా దేశ వ్యాప్తంగా 1,319 మందితో కూడిన ధనవంతుల జాబితాను హురున్ విడుదల చేసింది. లిస్టెడ్ కంపెనీల షేర్ ఆధారంగా, అన్‌లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి ఇన్వెస్టర్ రౌండ్‌ల విలువ ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది.
హురున్ రిపోర్ట్ వివరాలు.. భారత్‌లో గతేడాది వ్యవధిలో ప్రతి మూడు వారాలకు ఇద్దరు బిలియనీర్లు పుట్టుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో 259 మంది బిలియనీర్లు ఉన్నారు. గత 12 ఏళ్లలో ఈ సంఖ్య 4.4 రెట్లు పెరిగింది. హురున్ జాబితాలో ఉన్నవారిలో 51 మంది సంపద వార్షిక ప్రాతిపదికన రెండింతలు పెరిగింది. గతేడాదిలో ప్రతీ 10 మందిలో ఎనిమిది మంది ఆదాయాలు పెరిగాయి.
ఈ జాబితాలో గౌతం అదానీని అధిగమించి రిలయన్స్ ఇండిస్టీస్ అధిపతి ముకేశ్ అంబానీ అగ్రస్థానంలోకి వచ్చారు. దీంతో భారత్‌లో మళ్లీ అత్యంత ధనవంతుడిగా అంబానీ నిలిచారు. అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతం అదానీ సంపదకు హిండెన్‌బర్గ్ రిపోర్ట్ మర్చిపోలేని దెబ్బ కొట్టింది. అదానీ కంపెనీలు తీవ్ర ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయని.. కృత్రిమంగా షేర్ల ధరలను పెంచుతుందని.. విదేశాల్లోని పలు డొల్ల కంపెనీలతో మోసాలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ ఈ ఏడాది జనవరిలో రిపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీంతో అదానీ సంపద 57 శాతం పతనమై రూ.4.74 లక్షల కోట్లకు పడిపోయింది. ప్రస్తుత ఏడాదిలో ముకేష్ అంబానీ సంపద రెండు శాతం పెరిగి రూ.8.08 లక్షల కోట్లకు చేరింది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌లో గౌతం అదానీ సంపద తగ్గిపోయిందని హురున్ మేనేజింగ్ డైరెక్టర్, రీసెర్చ్ చీఫ్ అనస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు.
హురున్ జాబితాలో సీరం ఇన్స్‌ట్యూట్‌కు చెందిన సైరస్ పూనావాలా దేశంలో మూడో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. గతేడాది పోలిస్తే ఆయన సంపద 36 శాతం ఎగిసి రూ.2.78 లక్షల కోట్లకు చేరింది. తర్వాత హెచ్‌సిఎల్ టెక్‌కు చెందిన శివ్ నాడార్ సంపద 23 శాతం ఎగబాకి రూ.2.28 లక్షల కోట్లకు పెరగడంతో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. తర్వాత స్థానాల్లో గోపిచంద్ హిందుజా, దిలీప్ సంఘ్వీ, లక్ష్మీ నివాస్ మిట్టల్, రాధాకృష్ణన్ దమానీ, కుమార్ మంగళం బిర్లా, నీరజ్ బజాజ్ నిలిచారు. బైజూస్ అధినేత రవీంద్రన్‌కు ఈ దఫా జాబితాలో చోటు దక్కలేదు.
ఇ-కామర్స్ వేదిక జెప్టో సహ వ్యవస్థాపకుడు కైవల్య వోరా ఈ జాబితాలో అత్యంత చిన్న వయస్కుడుగా ఉన్నారు. 20 ఏళ్ల వోరా రూ.1,000 కోట్ల సంపదను కలిగి ఉన్నారు. 94 ఏళ్ల వయసులో ప్రెసిషన్ వైర్స్ ఇండియాకు చెందిన మహేంద్ర రతిలాల్ మెహతా హురున్ ధనవంతుల జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. అత్యధికంగా ముంబయి నుంచి హురున్ ధనవంతుల జాబితాలో 328 మంది చోటు దక్కించుకున్నారు. తర్వాత ఢిల్లీ 199, బెంగళూరు 100మందితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఫార్మాస్యూటికల్ రంగం నుంచి 133 మంది, రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగం నుంచి 119 మంది, పారిశ్రామిక ఉత్పత్తుల రంగం నుంచి 96 మంది చొప్పున బిలియనీర్లు ఉన్నారు.