Oct 03,2023 08:45

రవి ఏడవ తరగతి చదువుతున్నాడు. చదువులో ఎప్పుడూ ముందుంటాడు. ఒక రోజు తెలుగు ఉపాధ్యాయుడు శేఖరం మాస్టారు పాఠం మొదలు పెడుతూ 'పిల్లలూ నిన్నటి పాఠం గురంచి నేను ఇచ్చిన హోం వర్క్‌ తీసుకురం'డి అన్నారు. రవి తప్ప అందరూ హోంవర్క్‌ నోట్‌ బుక్స్‌ టేబుల్‌ పైన పెట్టారు.
          రవి హోం వర్కు చేయలేదన్న సంగతి గుర్తించిన మాస్టారు 'ఏం రవి.. నువ్వు హోం వర్కు చేయలేదా?' అని ప్రశ్నించారు. 'సార్‌, నేను హమ్‌ వర్క్‌ చేయలేదు' అన్నాడు రవి. 'కారణం చెప్పకుండా 'చేయలేదు' అని నిర్లక్ష్యంగా చెబుతావా, ఇటురా' అంటూ బెత్తం తీసుకున్నారు మాస్టారు. అప్పుడు రవి, 'సార్‌ మా అమ్మ ఇళ్లల్లో బట్టలుతికే పని చేస్తుంది. నిన్న సాయంత్రం మా అమ్మకు ఆరోగ్యం బాగోలేక పనికి వెళ్లలేదు. అయితే ఒక ఇంట్లో తప్పనిసరిగా పని చేయాల్సి వచ్చింది. దీంతో నేను వెళ్లి, వాళ్ల బట్టలు ఉతికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యమవ్వడంతో హోం వర్కు చేయలేకపోయాను' అంటూ జరిగిన సంగతి చెప్పాడు. మాస్టారు బెత్తం పక్కన పెట్టి రవిని దగ్గరకు పిలిచారు. 'పిల్లలూ హోమ్‌ వర్క్‌ చేయలేదు అనడానికి ఏ కాలు నొప్పో, కడుపు నొప్పో, జ్వరమో ఇలా ఏదో ఒక వంకతో అబద్దం చెప్పవచ్చు. కానీ రవి ఏమాత్రం సిగ్గుపడకుండా వాళ్ల అమ్మ చేసే పని చేశానని చెప్పాడు. అబద్దం ఆడకుండా నిజం చెప్పాడు. ఎప్పుడూ అబద్దం ఆడకూడదు. నిజమే చెప్పాలి. అదే మీకు గౌరవం తెచ్చిపెడుతుంది. ఈ సందర్భంగా మీకు మన జాతిపిత గాంధీ జీవితంలో జరిగిన ఒక సంగతి చెబుతాను వినండి.ఒకసారి గాంధీజీ ఇంట్లో వాళ్లు కోప్పడతారని ఒక సందర్భంలో అబద్దం చెప్పాడు. కొన్ని రోజుల తరువాత ఆయన 'సత్య హరిశ్చంద్ర' అనే నాటకం చూశాడు. అది ఆయన్ను ఎంతో ప్రభావితం చేసింది. వెంటనే ఇంటికి పరుగెత్తికెళ్లి తను అబద్దం చెప్పిన విషయాన్ని చెప్పి క్షమించమని అడిగాడు. అది మొదలు ఎప్పుడూ ఆయన అబద్దం ఆడలేదు' అని చెప్పారు. మాస్టారు మాటలు విన్న పిల్లలు 'ఇక మీదట మేము కూడా అబద్దాలు చెప్పం సార్‌' అని ముక్తకంఠంతో అరిచారు.
- యు.విజయశేఖర రెడ్డి,
99597 36475.