Jun 29,2023 07:17

కోటలోని రాజుగారు
వేట కొరకు వెడలినారు
సాయంకాలం వేళకు
ఒక పల్లెను చేరినారు

కడుపులోన కలత కలిగి
అజీర్తితో బాధ కలిగి
రాజు గారు వేటనాపె
బాణములను వేయగలిగి

రాజుగారు సొలసిపోయె
పరివారము అలసిపోయె
వారెక్కిన అశ్వములూ
అలసిసొలసి నిలచిపోయె

పల్లె ప్రజలు మురిసిపోయె
మర్యాదలు సాగిపోయె
గ్రామపెద్ద గృహములోన
విందునీయ సిద్ధమాయె

గ్రామపెద్ద రాములయ్య
ఉబ్బి తబ్బిబ్బయెనయ్య
సంచినొకటి చేతబట్టి
పరుగును లంకించెనయ్య

మంచి కూరగాయలెంచి
మంచివిందునీయ దలచి
ఖరీదైన కూరలకై
హడావుడిగా గాలించి

ఏవేవో కొనసాగెను
ఆలస్యం అవసాగెను
పరుగుపరుగు తీసుకుంటు
ఇంటికొచ్చి అవాక్కయెను

పదిమందీ కూర్చొనుండె
భోజనాలు సాగుచుండె
రాములమ్మ వంట రుచిని
రాజుగారు మెచ్చుచుండె

బలుసాకుల పచ్చడి తిని
భలే! భలే! బాగుందని
మెచ్చుకొనుచు చెప్పసాగె
తామెన్నడు తినలేదని

కంటినిండ నిదురపోయె
తెల్లవారి నలత పోయె
అజీర్తి తొలగి ఆకలేసి
రాజుగారు మురిసిపోయె

రాములమ్మ మర్యాదని
బలుసాకుల పచ్చడిని
మెచ్చి రత్నహారాలను
ఇచ్చి వెడలె కానుక అని

భలే మంచి బలుసు మొక్క
పెరటిలోని మందు మొక్క
మలబద్దక లక్షణమును
నివారించు చిన్న మొక్క.

అజీర్తినీ, పైత్యమునూ
జ్వర తీవ్రత బాధనూ
బలుసాకులు తగ్గించును
కీళ్ల నొప్పుల బాధనూ

ఆయుర్వేదమునందున
పథ్యముగా వాడు కాన
బతికుంటే బలుసాకును
తినవచ్చని సామెతన

- గుడిపూడి రాధికారాణి
94949 42583