Oct 24,2022 12:32
  • రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయం
  • వర్షాల పేరిట ముందుకుసాగని మరమ్మతులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామాలు మొదలు పట్టణాలు వరకూ..సర్వీసు రోడ్లు మొదలుకొని జాతీయ, రాష్ట్రీయ రహదారుల వరకు రాష్ట్రంలో ఏ దారిలో వెళ్లినా..దడ..దడ..లు ఎదుర్కొవాల్సిందే. అప్పటికే గుంతలమయమైన రహదారులు వర్షాల కారణంగా మరింత అధ్వాన్నంగా తయారయ్యాయి. ప్రభుత్వం మరమ్మతులు చేయాలని సంకల్పించినా..ఇప్పుడు వర్షాలు సాకుతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో రాష్ట్రంలో ప్రయాణమంటేనే ఒకింత గుబులు కలిగే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి. జాతీయ రహదారుల్లో సైతం మరమ్మతులు పడకేశాయి. ప్రయాణికుల నుంచి ముక్కుపిండి మరీ టోల్‌ వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరమ్మతుల విషయాన్ని కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాలకు వదిలేసింది. ఇక రాష్ట్రంలో గత మూడున్నర ఏళ్లుగా ఒకటి, అరా మినహా కొత్త రోడ్లు వేసింది లేదు. ప్రతిపక్షాల ఆందోళన ఫలితంగా గత ఏడాది తాత్కాలిక మరమ్మతులకు ప్రభుత్వం సంకల్పించింది. కొన్ని చోట్ల పనులు జరిగాయి. అయితే వర్షా కాలం మొదలైనప్పటి నుంచీ ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. మరమ్మతుల పనులు ముందుకు సాగడం లేదు. సాదారణంగా రోడ్ల పనులు వార్షిక నిర్వహణ, అధునీకరణల కింద చేపడుతారు. కాంట్రా క్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించక పోవడంతో ప్రభుత్వం టెండర్లకు పిలిచినా అధునీకరణ పనులకు ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి వుంది. దీంతో ప్యాచ్‌వర్క్‌లకు ప్రభుత్వం పరిమితమవుతోంది.
 

                                                                      టెండర్లకు స్పందన కరువు

రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌హెచ్‌యండిఆర్‌ పథకం కింద 854 పనులకు రూ.1282 కోట్లతో పనులు చేపట్టారు. అయితే అందులో కేవలం 81 పనులు పూర్తి అయ్యాయి. 616 పనులు వివిద దశల్లో వున్నాయి. 157 పనులకు సంబందించి టెండర్లకు స్పందన రావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న రోడ్లలో ఏడాదికి కనీసం 8 వేల కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతుల పనులు చేయాల్సివుంది.
 

                                                                      ఈ దారులు మరీ దారుణం..

ప్రధానంగా అనకాపల్లి, రామచంద్రాపురం, ద్రాక్షారామం రహదారులపై ప్రయాణం ప్రజలకు చుక్కలు చూపుతోంది. పలాస, టెక్కలిలోనూ రహదారులది ఇదే పరిస్థితి. నర్సారావుపేట నుండి వినుకొండ వరకు రద్దీగా వుండే రోడ్డుపై ఇటీవల ప్యాచ్‌ వర్క్‌లు చేసినా మళ్లీ పెద్దపెద్ద గుంతలు పడి దారుణంగా మారాయి. వినుకొండ నుండి ఎర్రగొండపాలెం వరకు వున్న రోడ్డుపై అయితే ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి లేదు. కర్నూలు నగరం నుండి సుంకేసుల వరకు నిత్యం రద్దీగా వుండే రోడ్డు మొత్తం దెబ్బతినడంతో ఆ రోడ్డులో బస్‌లను నడపలేమని సర్వీసులన్నింటిని ఆర్టీసి అధికారులు రద్దు చేశారు. రోడ్లపై పడ్డ గుంతలతో ఇప్పటిదాకా 10 బస్సులు దెబ్బతిన్నట్లు ఆర్‌టిసి అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులను చేపట్టాలని ప్రజలు విన్నవిస్తున్నారు.