విఆర్.పురం (అల్లూరి) : వరదొస్తే చాలు ... వడ్డుగూడెం కాలనీ, ధర్మతాల గూడెం గ్రామం జలదిగ్బంధమవుతుంది. అక్కడి ప్రజలు పునరావాసానికి వెళ్లాలన్నా వారి సామాన్లను తలలపై పెట్టుకొని వరదలో కాలినడకన 3 కిలో మీటర్లు నడిచి వెళ్లాలి. ప్రతీ ఏడూ ఇదే అవస్థ. ఆ కాలనీ గోడు ఏ అధికారీ పట్టించుకోవడం లేదనీ... ఇంకెన్నాళ్లీ కష్టాలు..! అంటూ వడ్డుగూడెం కాలనీవాసులు, ధర్మతాల గూడెంవాసులు వాపోతున్నారు.
శనివారం వడ్డుగూడెం కాలనీవాసులు ప్రజాశక్తితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. నిన్నటి నుండి వరద ప్రవాహం పెరుగుతూ ఈరోజు ఉదయం 11 గంటలకు 54.50 అడుగులకు చేరుకుంది. వరద ఇంకా పెరిగే అవకాశముంది. కానీ ఇంతవరకు వరద బాధితులను అక్కడి నుండి పునరావాసాలకు తరలించడానికి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు, సహాయకచర్యలూ చేపట్టలేదు. ప్రభుత్వం నుండి ఒక ట్రాక్టర్ కానీ, ఆటోలు కాని పంపించలేదని, తమ సొంత ఖర్చులతో ట్రాక్టర్ మాట్లాడుకొని సామాన్లను పునరావాస కేంద్రానికి తెచ్చుకుంటున్నామని వరద బాధితులు వాపోయారు. ట్రాక్టర్ కి 3,000 రూపాయలు తీసుకుంటున్నారని, మ్యాజిక్ అయితే 2,000 రూపాయలు ఖర్చు అవుతుందని.. డబ్బు లేక అవస్థలు పడుతున్నామన్నారు. డబ్బులేని నిరుపేద ప్రజలు తలల మీద భుజాల మీద సామాన్లను మోసుకుంటూ పునరావాస కేంద్రంలోనికి వెళ్లడానికి సుమారు వడ్డుగూడెం నుంచి రేకపల్లి వరకు మూడు కిలోమీటర్లు నడిచి రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎవరూ తమను పట్టించుకోవడం లేదని కంటతడిపెట్టారు. తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇస్తే ఇక్కడ నుండి వెళ్ళిపోతామని ఈ బాధలు తాము పడలేమని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తమను ఈ వరద బాధల నుండి తప్పించాలని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితులు కోరుతున్నారు.










