కులగణన సదస్సులకు అన్ని రాజకీయ పార్టీలనూ ఆహ్వానించాలి - సిఎస్‌కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణన కార్యక్రమ సన్నాహాల్లో భాగంగా ఈ నెల 17 నుంచి 22 వరకు జిల్లా స్థాయిలో వర్క్‌షాపులు, అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లుగా అధికారులు ప్రకటించారని, వాటికి అన్ని రాజకీయ పార్టీలనూ ఆహ్వానించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు సిఎస్ కెఎస్ జవహర్‌రెడ్డికి మంగళవారం ఆయన లేఖ రాశారు. ఈ సభలకు ఎవరిని ఆహ్వానిస్తున్నారో స్పష్టంగా ప్రకటించలేదని, రాజమండ్రి మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం ఎవరైనా హాజరు కాదలచుకున్నవారు అప్లై చేసుకోవాలని కోరినట్లు తెలిసిందని పేర్కొన్నారు. ముఖ్యమైన అంశంపై ఇలా క్యాజువల్‌గా ప్రకటించడం కులగణన కార్యక్రమానికి న్యాయం జరగదని పేర్కొన్నారు. భవిష్యత్ విధానాలను ప్రభావితం చేసే ఇంత ముఖ్యమైన అంశంపై కచ్ఛితమైన సమాచారం, నిష్పక్షపాతంగా జరగాలంటే రాజకీయ పార్టీలను భాగస్వాములను చేయడం సరైన పద్ధతని తెలిపారు. దీనిపై చొరవ తీసుకుని ఈ సమావేశాలకు అన్ని రాజకీయ పార్టీలనూ ఆహ్వానించి, వారి సూచనలను కూడా తీసుకుని ఈ కార్యక్రమం సమర్ధవంతంగా, సమగ్రంగా జరిగేలా చూడాలని కోరారు.
