సహజంగా మృతదేహాలను ఎత్తడం, అంత్యక్రియలు జరపడం అనేది పురుషులే చేస్తుంటారు. ఆ పనిలో మహిళలు అరుదు. అందులోనూ ఇంట్లో జరగక, బయట ఏ ఉపాధి దొరకగా ఇటువంటి వృత్తి చేపడుతున్నారు. ఈ నేపధ్యంలో భువనేశ్వర్‌కు చెందిన నలుగురు మహిళలు ఉన్నత ఉద్యోగాలు చేస్తూనే మరోవైపు శవాలకు కర్మకాండలు చేస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహాలను ఎత్తడం, దహనం చేస్తూ సమాజసేవ చేస్తున్నారు.
శవాలను పట్టుకోవడం, మోయడం, దహనం చేయడానికి ధైర్యం ఉండాలి. మహిళలు చేయలేరని, సున్నిత మనస్తత్వం గలవారని, భయస్తులన్న ఆలోచన చాలామందిలో ఉంటుంది. కానీ, భువనేశ్వర్‌కు చెందిన మధుస్మిత, మొహంతి, స్వాగతిక, స్నేహాంజలి మాత్రం ఓ లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకు తమ జీవితాల్లో ఎదురైనా సంఘటనలే కారణమని చెబుతున్నారు.
కోల్‌కతాలోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో నర్సుగా పని చేస్తున్న మధుస్మిత కోవిడ్ సమయంలో తన భర్త ప్రదీప్‌తో కలిసి మృతదేహాల దహన కార్యక్రమంలో పాల్గొనేది. అది తెలిసిన తన స్నేహితులకు ఆమె చేస్తున్న పని పట్ల గౌరవం కలిగింది. మధుస్మిత స్నేహితుల్లో ఒకరు స్నేహాంజలి జర్నలిస్ట్. మెహంతి దుకాణం నడుపేది. స్వాగతిక ఎస్‌బిఐ బ్యాంకు ఉద్యోగి. తామూ ఈ పని చేపట్టాలని నిర్ణయించుకున్నారు. కుటుంబసభ్యులు వద్దు అని వారించడంతో విరమించుకున్నారు. కరోనా సమయంలో వీరు తమ కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరిని కోల్పోయారు. రక్త సంబంధీకులైనా శవాల దగ్గరకు వెళ్లనీయలేదు. మృతదేహాలను పట్టుకొని ఏడ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. దయనీయ పరిస్థితులను చవిచూశారు. దాంతో చనిపోయిన వారికి గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఐదు నెలల క్రితం నలుగురు కలిసి ఓ అంబులెన్స్ కొనుగోలు చేశారు. అందులో అనాధ శవాలను, గుర్తుతెలియని మృతదేహాలను ఎత్తివేసి, వాటిని శ్మశానం దగ్గరకు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేస్తున్నారు.
రైలు ప్రమాదంలో ...
ఇటీవల జరిగిన కోరమాండల్ రైలు ప్రమాదంలో ఎంతో మంది చనిపోయారు. తీవ్ర గాయాలతో బాధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఈ నలుగురు స్నేహితులు ఘటన స్థలానికి చేరుకుని తమ వంతు సాయం చేశారు. తమ అంబుల్స్‌లో మృతదేహాలను స్థానిక బహనాగా పాఠశాలకు తరలించారు. గాయపడిన వారికి కటక్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారి కుటుంబసభ్యులు వచ్చేవరకూ వారి అవసరాలు తీర్చారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి, కోచ్‌ల ఇనుప శిధిలాల నుండి నాలుగు మృతదేహాలను బయటకు తీశారు. ఒకరి తల పూర్తిగా పగిలిపోయింది. మరొకరి కన్ను బయటకు వచ్చింది. మరో ఇద్దరు తమ అవయవాలను కోల్పోయారు. కాని ఎంతో ధైర్యంగా ఆ సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత వారం రోజుల పాటు వీరికి నిద్రపట్టలేదు. ఆ శవాల గుట్ట, క్షత్రగాత్రులు ఆర్తనాదాల దృశ్యాలు కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి. ఆ విపత్కర పరిస్థితిలో ఈ నలుగురూ క్షతగాత్రులకు అండగా నిబడ్డారు. వారి గాయాలు శుభ్రం చేసి, సపర్యలు చేశారు. రక్తంతో తడిచిన బట్టలను మార్చి, కొత్తవి ధరింపచేశారు. ఆహారం సమకూర్చారు. తినిపించారు. వీరు శవ దహన కార్యక్రమాలు చేస్తున్నారని బంధువులు ఏ శుభకార్యాలకూ పిలవడం లేదు. కొందరైతే వీరు ఎదురయితే దూరంగా పోతున్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మృతదేహాలకు కర్మకాండలు చేయడం మాత్రం ఆపమని ఈ నలుగురు యువతూలూ ముక్తకంఠంతో చెబుతున్నారు.










