Sep 21,2023 16:57

ప్రజాశక్తి-పాలకొల్లు(పశ్చిమగోదావరి) : అన్ని వసతులతో కూడిన పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటుకు నియోజకవర్గ విఆర్వోలు శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. గురువారం పాలకొల్లు మండలం కొత్తపేట పంచాయతీ పెంకుళ్ళపాడు, పురపాలక సంఘం పరిధిలో 20వ వార్డు యస్సి కాలనీ పాఠశాలలో పోలింగు స్టేషన్లను క్షేత్రస్థాయిలో నియోజకవర్గ ఈఅర్‌ఓ, తహశీల్దార్లతో కలసి కలెక్టరు పరిశీలించారు. పోలింగు స్టేషన్లు గదులు, విద్యుత్తు, డోర్సు, కిటికీలు, టాయిలెట్స్‌, ర్యాంపులు, పరిసరాలను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 2 కి.మీ. పరిధిలోపుగా పోలింగ్‌ స్టేషన్‌ ను ఖచ్చితంగా ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. పోలింగు స్టేషన్‌ లో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించి, దివ్యాంగులకు ర్యాంపు ఏర్పాట్లును మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం 1,500 లోపు ఓటర్స్‌ ఉంటే ఒక పోలింగు స్టేషన్‌, దాటితే అదనపు పోలింగు స్టేషను ఏర్పాటుకు తప్పని సరిగా ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. ఒకే కుటుంబం, ఒకే అపార్ట్మెంటులో నివసిస్తున్న ఓటర్లు అందరూ ఓకే పోలింగ్‌ స్టేషన్లో ఓటు వినియోగించుకునేలా రేషనలైజేషన్‌ ప్రక్రియలో అత్యంత బాధ్యతగా పూర్తి చెయ్యాలని అధికార్లకు కలెక్టర్‌ దిశా నిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్‌ వెంట పాలకొల్లు నియోజకవర్గ ఇర్వో కెసిహెచ్‌ అప్పారావు, తహశీల్దార్‌ సిహెచ్‌. పెద్ది రాజు, పురపాలక సంఘం కమిషనర్‌ బిఆర్‌ యస్‌ శేషాద్రి, టిపివో వీర బ్రహ్మం, డిప్యూటీ తహశీల్దారు వి.బ్రహ్మాజీ పాల్గొన్నారు.