Jun 26,2023 06:59

             2006 జనవరి 8, 9 తారీఖుల్లో ఖమ్మం జిల్లా సాహితీ స్రవంతి ఆధ్వర్యాన ఇరవై మంది కవులూ, రచయితలం పోలవరం ముంపు మండలాల్లోని ఇరవై గ్రామాల్లో పర్యటించాం. అక్కడి గిరిజనులు, గిరిజనేతరుల మనోభావాలను, ఆవేశాలను, ఉద్వేగాలను తెలుసుకున్నాం. ''మా బతుక్కి మీరేం జేస్తరు ?
         ముందది చెప్పండి!'' వర రామచంద్రాపురం మండలంలోని పోచవరం ఆదివాసీలు మమ్మల్ని ప్రశ్నించారు. 'మీ బాధల్ని, 'పోలవరం వల్ల మీకు జరిగే నష్టాన్ని అందరికీ చెప్పి, మీరు చేసే పోరాటానికి మా సాయమూ అందిస్తామన్న తరువాత వాళ్ళు మాతో మాట్లాడారు.
          పోలవరం ప్రాజెక్టు వల్ల మొత్తం 11 మండలాలు ముంపుకు గురవుతుండగా, అవన్నీ ఏజెన్సీ ప్రాంతాలే. 80 శాతం ఆదివాసీలు నివసించే రెండొందలకు పైగా గ్రామాలు, రెండు లక్షల మంది ప్రజలు, 2 లక్షల ఎకరాల సాగు భూమి, 90 వేల ఎకరాల్లోని అటవీ భూమి, అందులోని అటవీ సంపద మునిగిపోతున్నది. రాజ్యాంగం గిరిజనులకు రక్షణ కల్పించే ఐదవ షెడ్యూలు ప్రాంతంలో ఉన్న వీరు చెట్టుపుట్టలు వీడి, మైదానాల్లోకి నెట్టబడతారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, వారి మధ్య ఉన్న సంబంధాలు విచ్ఛిన్నమవుతాయి. ప్రకృతి రమణీయ పాపికొండలు, రెండు వందలకుపైగా చారిత్రక కట్టడాలు, ప్రాచీన ఆలయాలు కనుమరుగు అవుతాయి. ఇంత పెద్దఎత్తున నష్టానికి గురౌతున్న ప్రాంతాలు గల జిల్లాలోని కవులుగా, రచయితలుగా కనీస బాధ్యతతో మేం ఆయా ప్రాంతాల్ని సందర్శించాం. కవిత్వానికి కావలసినంత చైతన్యాన్ని, కథారచనకు కావల్సినంత జీవిత విభిన్న చిత్రాలను మేం వారి నుంచి పొందాము. మేము తిరిగిన అన్ని ప్రాంతాల్లోని గిరిజనులు, గిరిజనేతరులు తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని చెప్పారు. తమను ముంచే ప్రాజెక్టును మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. వ్యతిరేకించడానికి గల కారణాలనూ విశదపరిచారు. ప్రాజెక్టు కట్టినా, తమ బతుకులు ముంపునకు గురికాకుండా ఉండే మరో పద్ధతిని ఆలోచించండని వారు విన్నవిస్తున్న తీరు న్యాయంగా అనిపించింది. అడవిబిడ్డల అభిప్రాయాలను వారి మాటల్లోనే చూద్దాం.
         ''ఇక్కడే పుట్టినం. ఇక్కడే పెరిగినం. ఇక్కడే చస్త! 'చస్తే ఈ గోదావరిలోనే'. 'కోతులు కొండముచ్చులు ఈ చెట్లపై ఆకులు అలములు తిని బతకటం లేదా! అట్లనే బతుకుతం. ఈ అడవి వొదిలిపోం''
(రాజమ్మ, టేకూరు, వేలేరుపాడు)
''బయటికెళితే ఒక్కరమూ బతకం. మా పిల్లలు ఇపుడిపుడే అభివృద్ధిలోకి వస్తాండ్లు, మా బతుకు బజార్లెయొద్దు'
- (కెచ్చల వెంకటరెడ్డి, కట్కూరు)
          ''మా భూమి బంగారం. ఇత్తులు చల్లితే పంట చేతికొస్తది. ఇల్లాంటి మాకెక్కడా దొరకదు. ప్రాజెక్టు కట్టొద్దు. మా రాజ్యానికి మేమే రాజులం. ఎవ్వరిది వారికే కావాలి. పోరాటం చేస్తాం. మా భూమిపోతే మా బతుకుపొద్ది. తాటిచెట్టు గీస్తే నెల బతుకుతం. అక్కడ ఏం దొరుకుతుంది? ఊరోళ్ళందరమూ ఒకే మాట. ఊర్లను ముంచే ప్రాజెక్టు వద్దంటున్నాము.' (కనక రాజేశ్వరి, కరకగూడెం).
ప్రాజెక్టు నిర్వాసితుల రాష్ట్ర సంఘానికి అధ్యక్షుడు పాయం వెంకయ్యను కలిశాము. 'కొన్ని వందల ఏండ్ల నుంచి మేం ఇక్కడ నివసిస్తున్నాం. ముంపుకు గురయ్యే ప్రజలు, గ్రామపంచాయితీలు తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపాము. చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మా హక్కుల్ని కాలరాస్తోంది. సంవత్సరంలో ఐదునెలలు అటవీ సంపదలపైనే ఆధారపడి గిరిజనులు బతుకుతారు. వేరే చోట ఇవేవీ దొరకవు. మేం సంవత్సరానికి ఐదుసార్లు పండుగ చేసుకుంటాం. పండగల్లో అందరమూ కలుస్తాం. మంచీచెడు చర్చించుకుంటాం. ఎవరికి ఏ నష్టం జరిగినా ఊరువాళ్ళం ఇంటికింత వేసుకొని ఆదుకుంటాము. మాది గుంపు సంస్క ృతి. ఇది విచ్ఛిన్నమైతే మా సంస్క ృతి అంతా నశిస్తుంది.'' అని ఆవేదన వ్యక్తం చేశాడు.
         ఈ పర్యటన అనంతరం మేము ఆదివాసీలకు సంఘీభావం తెలుపుతూ 'పోలవరం-కవుల స్వరం' పేర కవితాగోష్ఠి నిర్వహించాం. పర్యటనలో పాల్గొన్న కవుల స్పందన ఇలా ఉంది : 'తన పిల్లల్ని తానే తింటున్న పాములా ఒకొక్క పల్లెను కబళిస్తుంది డ్యాము/ తుఫానులో చిక్కుకున్న జీవుల్లా ముంపు గ్రామాలు గొంతెత్తి రోదిస్తుంటాయి'. అని షుకూర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. 'ప్రాజెక్టులంటారు. ఫలితమిస్త యంటారు.. ఎవరికయ్యా! ఎద్దువుండు కాకికి ముద్దుకాక ఏమయితది?' అని ఆదివాసీల బాధల్ని పలికించాడు కటుకోజ్వల రమేష్‌. ''ఊరికి నిప్పంటుకుంటే నీళ్ళు పోసేవాళ్ళం, ఇపుడు ఊళ్ళకు నీరంటుకొంటోంది ఏం చేయాలి?' అని శేషగిరి ప్రశ్నించాడు. 'నది ఇపుడు ప్రకృతి కాదు, సరిహద్దుల్ని చెరిపేసిన కన్స్యూమరు గూడు', 'కొండ చిలువనెదిరించడం కొత్తకాదు మాకు, ప్రయత్నపూరిత ప్రళయాలకు ప్రతిఘటనే ఆనకట్ట!' అని నినదించారు ఆనందాచారి.
          'దుఃఖాశ్రువులే దావానలమౌతాయయి' (కాసర్ల రంగారావు); 'అడవిలో దొంగలుపడ్డారు' (హనీఫ్‌); 'ఆనాడు రెడ్‌ ఇండియన్లు వేసిన ప్రశ్న ఇప్పుడు ఆదివాసీలు వేస్తున్నారు' (విద్యాసాగర్‌); ''పాపికొండల రమణీయ అందాల్ని మింగేస్తూ, బహుళజాతి సంస్థలకు లాభాలు అందిస్తూ' (జీవన్‌); 'బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాదిది, బహుళార్ధ బాధక ప్రాజెక్టు (సాధనాల); 'ఇది ప్రభుత్వ సునామి' (రౌతు రవి) అంటూ కవులు ప్రతిస్పందించారు. హనుమాన్‌, మండవ సుబ్బారావు, మాల్యశ్రీ, శిరంశెట్టి కాంతారావు, దుర్గాచారి, సూర్యకుమారి, కవిత, పోతగాని సత్యనారాయణ, ఐ.వి., లెనిన్‌ శ్రీనివాస్‌ తమ అనుభూతులను కలబోసుకుంటూ ఆదివాసీలకు మద్దతు ప్రకటించారు.
           ఈ పర్యటన మాకు సమాజం పట్ల బాధ్యతను మరోమారు గుర్తుచేస్తూ చైతన్యాన్ని అందించింది. కొండలు, లోయలు, ప్రకృతి అందాలు, గోదావరి- శబరి సంగమ సోయగాలు, అంతే అందంగా ఉన్న అక్కడి ప్రజల జీవనలయలను ఛిద్రం చేయబూనడం నేరమనిపించింది.

(పర్యటన అనంతరం వెలువరించిన 'జీవన్మరణం' పుస్తకానికి రాసిన ముందుమాటలోని కొన్ని భావాలు ఇవి.)
- కె.ఆనందాచారి