Oct 30,2023 08:33

''వాళ్ళకేం! అందరినీ వదిలేసి విదేశాలకు పోయి బోలెడంత సంపాదించుకొని హాయిగా స్థిరపడిపోయారు!'' తెలుగువాకిళ్లలో అడపాదడపా వినిపించే మాటలే ఇవి. కానీ ఆ వెళ్లినవారి గతి ఏమైందో, ఎన్ని అగచాట్లు పడ్డారో, మాతృదేశంపై మమకారం వారి కళ్ళ నుంచి ఎన్నిసార్లు నీరై ప్రవహించిందో ఎవరికి ఎరుక! కంప్యూటర్లు, వీడియో ఫోన్లు లేని రోజుల్లో మాతృదేశాన్ని వదిలి దూరంగా పరాయి దేశాలకు వెళ్ళిన ప్రవాసీయుల స్థితి, సామాజిక ఇబ్బందులు నేటి తరంవారికి ఊహకు కూడా అందవు.
పరాయి దేశంలో పరాయి సంస్క ృతి మధ్య బతకడం, తెగించి బతకనేర్వడం, మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంత సులువైన
విషయం కాదు. అటువంటిది అక్కడ తమ వారందరినీ కలుపుకుంటూ చిన్నచిన్న సంఘాలుగా ఏర్పడి కలసి సంస్కృతిని సాహిత్యాన్ని ఆచార వ్యవహారాలను కళలను పోషించి కాపాడుకునే ప్రయత్నం చేస్తూ అందులో నిలదొక్కుకోవడం వెనుక ఎంత కృషి ఉంటుందో అర్థం చేసుకోవడం చాలా కష్టం.
           వలస వెళ్లడం అనేది కొందరికి ఆశ, కొందరికి అవకాశం, కొందరికి అవసరం, కొందరికి అనివార్యం. కొందరు కాయకష్టాన్ని నమ్ముకుని వెళ్లినవారైతే కొందరు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి వెళ్లారు. కారణం ఏదైనా వారు ఎదుర్కొనే సమస్యలు మాత్రం ఒకటే! 60 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లిన తెలుగువారి పరిస్థితులను, వారి ప్రస్థానాన్ని 'షష్టిపూర్తి' సందర్భంగా పుస్తక రూపంలో తీసుకురావాలనే 'తెలుగు మల్లి' సంస్థ నిర్వాహకులు కొంచాడ మల్లికేశ్వరరావు గారి సంకల్ప కణిక ఇన్నాళ్లకు జ్వాలగా మారి 'తూర్పు తీరంలో తెలుగు రేఖలు'గా వెలుగులు విరజిమ్ముతోంది.
          60 ఏళ్ల క్రితం భారతీయ వస్తువులు, ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా లభ్యం కాని సమయంలో ఆస్ట్రేలియా వచ్చి స్థిరపడిన కుటుంబాలే నేటి ఆస్ట్రేలియాలోని తెలుగువారికి ఎలా ఆదర్శం అయ్యాయో ఈ కథనం తెలియపరుస్తుంది. కొంచాడ రావు ఈ పుస్తక రచన విషయంలో ఎంత శ్రద్ధ వహించారో, ఎన్నాళ్ళు శ్రమించారో నాకు తెలుసు. ఆస్ట్రేలియా అంటే చిన్న దేశమేమీ కాదు. వివిధ ప్రాంతాల్లో 60 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడిన తెలుగువారి కుటుంబాలను అందరినీ కలుసుకుని, వారి ముందు తరాల వారి విషయాలను సేకరించి ఒక పుస్తక రూపంలో తీసుకురావాలన్న ఆలోచనే ఎంతో హర్షించదగినది, వ్యయప్రయాసలతో కూడుకున్నది. దానికి దేశంలోని తెలుగువారందరూ సహకరించడం, విషయ సేకరణకు అవసరమైన సమాచారాన్ని సమకూర్చడం మరింత ముదావహం. ఆస్ట్రేలియాలో కాలానుగుణంగా విద్యా, వైద్య, విజ్ఞాన, సాంకేతిక, సాంస్క ృతిక, ఆర్థిక, రాజకీయ తదితర రంగాల్లో తెలుగువారు తమ సత్తా చాటుకున్న తీరు, అక్కడ వచ్చినటువంటి రాజకీయ సామాజిక పరిణామాల ప్రభావం, వలసచట్టాలు, ఆర్థిక స్థితిగతులు వంటి విషయాలను తెలియపరచడంతో పాటు ఆస్ట్రేలియాలోని తెలుగు జీవనాన్ని ప్రతిబింబింపజేసే మొట్టమొదటి ప్రామాణిక గ్రంథంగా ఈ పుస్తకం పేరు తెచ్చుకుంటోంది. అందుకే ఈ పుస్తకం పాఠకులను ఆసక్తికరంగా త్వరగా చదివించేలా చేస్తుంది. పుస్తకం చదువుతున్నంత సేపు దాదాపు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండే ప్రవాసీయులు తమ దేశంలోని పరిస్థితులతోను,
తమ స్వీయ అనుభవాలతోనూ పోల్చు కోకుండా ఉండలేరు.
ఆస్ట్రేలియాలో దేవాల యాల నిర్మాణం, తెలుగు సంస్థల ఆవిర్భావ విషయాలు, పలువురు పెద్దల ప్రవాస అనుభవాలు, ఉద్యోగ అవకాశాలు, తెలుగు పత్రికలు, భాషా సాంస్కృతిక వికాసం మొదలైన ఎన్నో విషయాలను ఈ పుస్తకం ద్వారా నేటితరం తెలుసుకోవచ్చు. తూములూరి శాస్త్రి, దూర్వాసుల మూర్తి, డాక్టర్‌ చింతలపాటి మురళీకృష్ణ, డాక్టర్‌ చేవెళ్ల జనార్ధన రెడ్డి వంటి పెద్దల అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.
మధ్యలో 'ప్రవాసంలో పెళ్ళి ప్రహసనం' భలే సరదాగా అలరించింది. ఈ కథతో పాటుగా పాఠకులు కూడా ఒకసారి అలా ఆస్ట్రేలియాలో రంగనాథం ఇంటికి వెళ్లిరావడం ఖాయం. పాయసంలో జీడిపప్పులా, సంభాషణలలో చక్కటి తెలుగు సామెతలు రుచికరంగా ఒదిగిపోయాయి. భార్యాభర్తల సంభాషణలు చాలా హాస్యభరితంగా సహజంగా అమరిపోయాయి. ''ఈ మధ్య నిశ్శబ్దమే ఎక్కువ శబ్దం చేస్తోంది'', ''చీకటిలో కోపం కనిపించలేదు కానీ మాటలో కరుకుదనం వినిపించింది'', ''ముఖంలో వెలిగిన చిరునవ్వు పెదవులు దాటనివ్వలేదు'' ''వెళ్తే పని, లేకపోతే జీతం'' వంటి ప్రయోగాలు ప్రత్యేకించి నన్ను ఆకట్టుకున్నాయి. మా రావు గారు ఇంతటి కథకులు అని తెలియనేలేదు ఇన్నాళ్లూ! త్వరలో వారి నుంచి మరో కథల పుస్తకం కూడా రావాలని ఆశపడుతున్నాను.
ఆస్ట్రేలియాలో జరిగిన పలు తెలుగు కార్యక్రమాలకు వెళ్లి వచ్చిన కొందరు భారత ప్రముఖులు యొక్క అనుభవాలు, విశ్లేషణ కూడా ఈ పుస్తకానికి మరింత వన్నె తెచ్చాయి. పత్రికలు, కవితలు, కథలు, పాటలు, పద్యాలు, నాటకాలు, అవధానాలు.. ఒకటేమిటి! ఆస్ట్రేలియాలోని తెలుగువారు స్పృశించని సాహితీ ప్రక్రియ లేదు. ఆస్ట్రేలియా ఖండంలోని పలు ప్రాంతాల్లో విలసిల్లిన తెలుగు సంస్థలు, పత్రికలు, రేడియో, టీవీ కార్యక్రమాలు, తెలుగు సదస్సులు, సాంస్కృతిక సమ్మేళనాలతో సహా, న్యూజిలాండ్‌ దేశంలో కూడా జరిగేటటువంటి తెలుగు కార్యక్రమాల గురించి విపులంగా ఈ పుస్తకంలో ప్రస్తావించడం వల్ల ఖచ్చితంగా ఇది ఇతర దేశస్థులకు మార్గదర్శకంగాను, స్ఫూర్తిదాయకంగానూ ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.
తెలుగుమల్లి, TAAI, సిడ్నీ తెలుగు సంఘం, తటపర్తి గురుకులం, న్యూజిలాండ్‌ తెలుగు సంఘం, సంగీత భారతి, మొదలైన సంస్థలతో మా సింగపూర్‌ 'శ్రీ సాంస్కృతిక కళాసారథి'కి ఉన్న ప్రత్యక్ష అనుబంధం, ఆస్ట్రేలియాలోని తెలుగువారితో నాకున్న వ్యక్తిగత స్నేహం, 'తటపర్తి గురుకులం'లో సభ్యురాలిగా వారితో నాకున్న సాన్నిహిత్యం.. ఈ పుస్తక పఠనం ద్వారా మరొకసారి నెమరు వేసుకుంటూ ఆనందించాను. ఆస్ట్రేలియా తెలుగు ప్రభలు మరింత జాజ్వల్యమానంగా ప్రకాశించాలని ఆకాంక్షిస్తూ, రావు గారికి, ఈ పుస్తకరచనలో భాగస్తులైన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు.
- రాధిక మంగిపూడి