Oct 04,2023 09:31

వారంతా అడవి బిడ్డలు.. బయట ప్రపంచం తెలియని చిన్నారులు... అడవుల్లో దొరికే గడ్డలు, కందలు, సహజసిద్ధంగా లభించే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకుంటారు. తమ తల్లిదండ్రుల మాదిరిగా వేటాడుతూ జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రపంచం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇంత పురోగతి సాగిస్తున్నా కొండకోనల్లో ఉండే గిరిజనం (ఆదివాసీలు) పడుతున్న ఇబ్బందులను కళ్లారా చూసిన ఓ 37 సంవత్సరాల వ్యక్తి మార్పుకోసం తనవంతుగా కృషిచేశాడు. వారికి చదువు నేర్పించి మెరుగైన జీవితం పొందటానికి తోడ్పడుతున్నాడు. కొండకోనల్లో అక్షర దీపం వెలిగిస్తున్న అతడు తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్‌ జిల్లాకు చెందిన సతీష్‌. అతడి కృషి గురించే ఈ కథనం ...

55

మిళనాడులోని ఈరోడ్‌ జిల్లాలో సత్యమంగళం ప్రాంతంలో ఎక్కువమంది గిరిజన ప్రజలు నివసిస్తున్నారు. వారంతా నిరక్షరాస్యులు. అడవిలో లభించే పండ్లు, దుంపలు వంటివి తిని బతుకుతున్నారు. పాఠశాలలు సమీప ప్రాంతాల్లో లేకపోవటంతో పిల్లలు కూడా బాలకార్మికులుగానే మిగిలిపోతున్నారు. సత్యమంగళం పట్టణంలో సతీష్‌ కుటుంబం నివసిస్తోంది. సతీష్‌కి తల్లిదండ్రులు, భార్య, పిల్లలూ ఉన్నారు. తమకున్న ఐదెకరాల పొలంలో పూలసాగు చేస్తూ వచ్చిన ఆదాయంతో కుటుంబం ముందుకు సాగుతోంది. సతీష్‌ 2014 నాటికి పీజీ, బీఈడీ పూర్తిచేశాడు. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నాడు. సత్యమంగళంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. ఆ విధుల్లో భాగంగా ఒకసారి గుండ్రి అనే కొండ గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. ఎలాంటి రవాణా సదుపాయమూ లేకపోవటంతో కాలినడకనే చేరుకున్నాడు. ఈ ఊళ్లో బడిఈడు పిల్లలంతా ఒంటిపై చిన్నపాటి పీలికలు మాత్రమే ధరించి, జుత్తు పెరిగిపోయి, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తిరుగుతుండటం గమనించాడు. చాలామంది పిల్లలు కల్లు సేవించి కూని రాగాలతో తూగుతుండడం అతడిని కలవరపరిచింది.
            గుంపుగా ఆడుకుంటున్న పిల్లలను పిలిచి వారితో మాట్లాడాడు. వారి అమాయకపు మాటలు, హావభావాలు సతీష్‌లో చాలా ఆవేదన కలిగించాయి. బడికెళ్లాల్సిన బాల్యం ఇలా సమాధి అయిపోతుందే అని బాధపడ్డాడు. ''నేను చదువు చెబుతా... చదువుకుంటారా?'' అని అడిగాడు. పిల్లలు సరే అన్నారు. ఆ తరువాత ఆ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. చదువు నేర్పుతానంటే వారు వద్దంటారా? పూర్తిగా అర్థం కాకపోయినా, అది తమ మంచి కొరకే అనుకున్నారు.
          కానీ, ఆ చదువు చెప్పటం సతీష్‌కే కష్టం. ఎందుకంటే- కొండవాలు గ్రామాలకు వచ్చి వెళ్లాలంటే చాలా కష్టం. అడవి, కొండలు, గుట్టలు, వాగులు దాటుకుని నడవాలి. వర్షాకాలమైతే ప్రయాణం మరింత దుర్లభం! అయినా, అతడు వెనుకంజ వేయలేదు. గిరిజన బిడ్డల కోసం తన ప్రయివేటు ఉద్యోగాన్ని వదులుకున్నాడు. 'ట్రీ పీపుల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌'ను స్థాపించాడు. ఇటు వ్యవసాయ పనుల్లో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూనే కొండిగామాలకు వెళ్లి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే కృషి ప్రారంభించాడు.
సతీష్‌ ప్రతిరోజూ ఉదయాన్నే లేచి పూలుకోసి ఇంటికి తెస్తాడు. వాటిని కుటుంబ సభ్యులు మార్కెట్‌కు తీసుకెళతారు. అప్పుడు సతీష్‌ అడవి బాట పడతాడు.
           గుండ్రి, కడంపూర్‌, తాళవడి, బర్గూర్‌ గిరిజన గ్రామాల్లో బడి ఈడు పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ఆ గ్రామాలన్నీ దగ్గర దగ్గరగానే ఉంటాయి. ఏ ఊరు కేంద్రంగా బడిని నడపాలో మొదట్లో అర్థం కాలేదు. అన్ని గ్రామాలకు వెళ్లి కొంత కొంత సేపు చదువు చెప్పటం మొదలెట్టాడు. ఇదే సమయంలో ఆయనకు ఓ ఎన్‌జిఒ సంస్థ ప్రతినిధులు పరిచయమయ్యారు. సతీష్‌ చేస్తున్న సేవలను తెలుసుకొని ప్రోత్సాహం అందించారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించటానికి కొంత దోహదపడ్డారు.
         సతీష్‌ కొన్ని రోజులు ఆయా గ్రామాల్లో ఉంటూ పిల్లలకు చదువు చెప్పేవాడు. మొదట్లో చెట్టుకిందనే విద్యా బోధన సాగేది. ఎలాగైనా పాఠశాల భవనాన్ని నిర్మించాలని అనుకున్నాక- గ్రామ పంచాయతీ 10 సెంట్ల స్థలాన్ని అందుకు కేటాయించింది. సతీష్‌ తన కుటుంబ సభ్యుల బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి రూ.1.50 లక్షలతో పాఠశాలకు పునాదిని నిర్మించాడు. ఓ ప్రయివేటు విద్యాసంస్థ కొంత ఆర్థిక సహాయం చేసింది. దాంతో, భవన నిర్మాణం పూర్తయింది. 2020లో పాఠశాల ప్రారంభం కాగా, మొదటి ఏడాది 70 మంది విద్యార్థులు పాఠశాలలో చేరారు. ఎన్‌సిఎల్‌పి పథకం ద్వారా ప్రభుత్వం ముగ్గురు ఉపాధ్యాయులను నియమించింది. వారికి నెలకు రూ.7500 ఇచ్చేలా నియామకం చేసింది. సజావుగా నడుస్తున్న క్రమంలో 2022, మార్చిలో ఎన్‌సిఎల్‌పి పథకాన్ని కేంద్రప్రభుత్వం నిలిపేసింది. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పాఠశాలలో పిల్లలను చేర్పించాడు సతీష్‌. దూరాభారం వల్ల చాలామంది పిల్లలు పాఠశాలకు స్వస్తి పలికారు. ఈ పరిస్థితిని గమనించిన సతీష్‌ తిరిగి పాత ప్రాంతంలోనే సాయంత్రం తరగతులను ప్రారంభించారు. నెలకు రూ.5000 ఇచ్చి జీతంపై పనిచేయటానికి డిగ్రీ చదివిన వ్యక్తిని సహకారిగా నియమించారు. ప్రస్తుతం 42 మంది ట్యూషన్‌కు హాజరవుతున్నారు. అన్ని కొండ గ్రామాలకు ఈ సాయంత్రం తరగతులను విస్తరించటమే తన లక్ష్యమని సతీష్‌ చెబుతున్నాడు. 200 మందికిపైగా పాఠశాల నుంచి డ్రాపౌట్స్‌ ఉన్నారనీ, వారందరికీ తిరిగి పాఠశాలలో చేర్పించటమే తన లక్ష్యమని చెబుతున్నాడు. తాను ప్రోత్సహించిన వారిలో ఇప్పుడు పదిమంది వరకూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, అదే తనకు గర్వకారణమని సంతోష్‌ అంటున్నాడు. ఆ యువకుడి కృషికి ప్రభుత్వ సహాయం అందాలి. ఆ కొండల్లో అక్షర దీపం వెలగాలి !