మనసులోని భావాలకు, ఊహలకు మాటలతో కాకుండా అందమైన కవిత్వంతో అల్లిన అలతి పదాలతో అనుభూతినొందే అక్షర కావ్యంలా 'చినుకు తాకిన నేల' కవితా సంపుటిని వెలువరించారు కవయిత్రి శాంతికృష్ణ. కవిత్వం ఓ ప్రవాహమై పరవళ్ళు తొక్కింది. ఈ కవిత్వం చదువుతుంటే ప్రతి కవితా ఓ చిరుజల్లులా మన మనసును తడిపేస్తుంది.
బంధాలు అనుబంధాలతో పాటు ప్రకృతిలోని అందమైన దృశ్యాల వర్ణన కళ్లకు కడతాయి. 'గురువంటే నాన్నే' అనే కవితతో ప్రారంభించి నాన్నకు తన మనసులోని స్థానాన్ని చాటుకున్నారు. 'నాన్నంటే హిమోన్నత శిఖరమే/ వినయమే విజయానికి సోపానమని/ ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని / అనుక్షణం హెచ్చరిస్తూ ..' నాన్న గొప్పతనాన్ని ఈ కవితలో తెలియజేశారు. 'సంద్రం పిలుపు' కవితలో తుపాను సమయంలో గంగపుత్రుల వెతలు కంటికి కట్టినట్లు అలతి పదాలతో దశ్యమానం చేశారు. 'ఆకలి చేసే పేగుల చప్పుళ్ళు/ వాన చప్పుళ్ళతో కలిసిపోతున్నాయి' అని ఆకలి బాధ గురించి చెప్పారు.. 'తడికట్టెలు మొరాయిస్తున్నాయి / పొగ గొట్టంతో కుస్తీ పడుతూ ..' అని ఒక కవితలో చదివినప్పుడు - నా చిన్ననాటి పల్లె జ్ఞాపకాలను గుర్తుకు వచ్చాయి. వాన వచ్చి పదును చేరిన కట్టెలతో అగ్ని రాజేయటం ఎంత కష్టమో పల్లె తల్లులకు తెలుసు. 'గూడు రిక్షా' కవిత కూడా రిక్షావాలా కష్టాలను కళ్లకు కట్టించారు. 'తాను కదలని రోజు/ యజమానికి పూటగడవదని/ కదులుతోన్న కాలపు వేగాన్ని / తానందుకోలేక పోతోందని ..' రిక్షాకు ఆపాదిస్తూ చెప్పారు. 'ప్రతి రూపం' కవితలో అమ్మతో తన అనుబంధాన్ని ఆవిష్కరించారు. అమ్మతనమున ఎంత కమ్మదనం ఉందిరా అమృతానికే ఆమె తీపి నేర్పింది రా అన్నారు ఓ కవి. కన్ను తెరిపించేది, వెన్న తినిపించేది అమ్మే... 'అమ్మ ఉదరం లోనే కాదు/ హృదయంలో కూడా / హత్తుకుపోయిన బంధం నేనే/ అమ్మ వెలిగించిన చిరుదివ్వెను నేన'ే అని అమ్మ గురించి చక్కగా చెప్పారు. 'మృగమన్న పదం వాడితే తిరగబడతాయేమో మృగాలు' అంటూ 'మృగాడు', 'వెన్నెలకూన' కవితల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై అక్షరాస్త్రాలు సంధించారు.
'చినుకు తాకిన నేల' కవితలో తల్లి ప్రేమకు నోచుకోని అనాధల వెతల గురించి వివరించారు. 'కాసింత సాయం అందిస్తే / చిగురించిన కొమ్మల్లా పచ్చదనాన్ని రాసుకొని పసిడి మొక్కలవుతారు' అని వారిపై ప్రేమవర్షం కురిపించారు. మనలోని మానవత్వాన్ని తట్టిలేపే ప్రయత్నం చేశారు. 'చిట్టితల్లి' కవితలో భ్రూణ హత్యల గురించి ప్రస్తావిస్తూ.. 'కన్నే తెరవని చిట్టితల్లిని చిదిమేయాలని చూసే వాళ్ళని చిదిమేయకు నా ప్రాణాన్ని అని మొర పెట్టుకుంటున్న బాధను అక్షరీకరించిన విధానం గుండెల్ని పిండేసేదిగా ఉంది. ఈ సంపుటిలోని కవితలన్నీ సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రాసినవే! పఠితుల మనసులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.
- కె.వి.ఎన్. మూర్తి,
94908 05404










