Jul 02,2023 22:25

-ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంలో చేరిన ప్రతిపక్ష నేత అజిత్‌ పవార్‌
- రెండో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం
- ఎన్‌సిపి మొత్తం తమ వెంటేనని ప్రకటన
- దోపిడీగా పేర్కొన్న శరద్‌ పవార్‌
ముంబయి : మహారాష్ట్రలో ఎన్‌సిపి సమాప్తం అంటూ కొద్ది రోజుల కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో అక్కడ రాజకీయంగా పెద్ద కుదుపు చోటుచేసుకుంది. నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి)లో ఇదివరకే పలు పర్యాయాలు తిరుగుబాటు బావుటా ఎగరేసి బిజెపి పంచన చేరిన సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ మరోమారు కాషాయ గూటికి చేరారు. మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన ఆ పదవికి రాజీనామా చేసి ఏకంగా అధికార కూటమిలో చేరిపోయారు. ఈ క్రమంలో ఆదివారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వ ప్రభుత్వంలో రెండో ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉన్న సంగతి విదితమే. కేంద్రంలోని బిజెపిని గద్దె దించే లక్ష్యంతో ఇటీవల బీహార్‌ రాజధాని పాట్నాలో ప్రతిపక్షాలు భేటీకావడం, ఆ సమావేశానికి ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌, మరో సీనియర్‌ నేత సుప్రియా సూలే హాజరవ్వడం తొలి నుంచి బిజెపి స్వరాన్ని వినిపిస్తున్న అజిత్‌ పవార్‌కు, ఆయన అనుచరులకు నచ్చకపోవడమే ఇప్పుడు ఈ తిరుగుబాటు లేవదీయడానికి కారణంగా కనిపిస్తోంది. రాజ్‌భవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అజిత్‌ పవార్‌తో రాష్ట్ర గవర్నరు రమేశ్‌ బయీజ్‌ ప్రమాణం స్వీకారం చేయించారు. ఎన్‌సిపికి చెందిన మరో 8 మంది నేతలు ఛంగన్‌ భుజ్బల్‌, దిలీప్‌ వాల్సే పాటిల్‌, హసన్‌ ముషరీఫ్‌, ధనాంజరు ముండే, అదితి తత్కారే, ధర్మరావ్‌ అత్రమ్‌, అనిల్‌ పాటిల్‌, సంజరు బంసోడే రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.
కాగా రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన శాసనసభ స్పీకర్‌ మాట్లాడుతూ 'ప్రతిపక్ష నేత పదవికి అజిత్‌ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించాను' అని తెలిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌, ఎన్‌సిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రఫూల్‌ పటేల్‌ కూడా హాజరయ్యారు. శాసనసభలో ఎన్‌సిపికి 53 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 40 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నారని బిజెపి మహారాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్‌ బవాంకులే తెలిపారు.
చీలిక కాదు..చేరికే ..: అజిత్‌
మహారాష్ట్రలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో చేరేందుకు ఎన్‌సిపిని తాము చీల్చలేదని, ఆ వాదనలు సరికాదని అజిత్‌ పవార్‌ పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్‌సిపిలో అందరి మద్దతూ తమకే ఉందని, భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఎన్‌సిపి పార్టీ గుర్తు పైనే తాము పోటీ చేస్తామని చెప్పారు. ఎన్‌సిపి శాసనసభాపక్షం ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందని తెలిపారు. పార్టీలో అందరూ ఎమ్మెల్యేలూ షిండేాఫడ్నవీస్‌ ప్రభుత్వంలో భాగంగా కావాలని నిర్ణయించినట్లు అజిత్‌ తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేనతో కలిసి వెళ్లగలిగినప్పుడు ... బిజెపితో కలిసి ఎందుకు వెళ్లకూడదని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం పురోగమిస్తోందని, ఆయన ఇతర దేశాల్లోనూ ప్రజాదరణ చూరగొంటున్నారని, రాబోయే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో బిజెపి కూటమితో కలిసి పోటీ చేస్తామని అజిత్‌ తెలిపారు. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరామన్నారు. దేశాభివృద్ధి కోసమే ఎన్‌డిఎలో చేరామన్నారు. 'మేమంతా ఇక్కడే ఉన్నాం. ఎమ్మెల్యేలందరూ నాతోనే ఉన్నారు. మేమంతా ఇక్కడ పార్టీగానే ఉన్నాం. సీనియర్లందరికీ కూడా ఈ విషయం చెప్పాం. ప్రజాస్వామ్యంలో మెజార్టీకే అత్యంత ప్రాధాన్యం. 24 ఏళ్ల మా పార్టీకి యువ నాయకత్వం ముందుకు రావాలి' అని ఆయన ట్వీట్‌ కూడా చేశారు.
ఇది దోపిడి : శరద్‌ పవార్‌
ఆదివారం చోటుచేసుకున్న పరిణామాలపై ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ స్పందించారు. ఈ పరిణామాలు ఇతరులకు కొత్త కానీ, తనకు కాదని చెప్పారు. ఎన్‌డిఎలో అజిత్‌ పవార్‌ చేరడం గూగ్లీ కాదని, దోపిడీ అని ఆయన విమర్శించారు. ఎన్‌సిపి పేరును తీసుకొని ఎవరైనా ఏదైనా మాట్లాడితే తాము పోరాడతామని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని ఆయన తెలిపారు. ఎన్‌సిపి ప్రధానబలం .. సామాన్య ప్రజలేనని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. శానససభలో ప్రతిపక్ష నేతగా అజిత్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో సీనియర్‌ నేత జితేంద్ర అవద్‌ను ప్రతిపక్ష నేతగా నియమిస్తున్నట్లు శరద్‌ పవార్‌ ప్రకటించారు.
ఎన్‌సిపి ఫినీష్‌ అని మోడీ అన్నారు..
'నా ఇల్లు విడిపోయిందని నేనెప్పుడూ చెప్పను. ఈ సమస్య నా ఇంటిది కాదు. ప్రజల సమస్య. తిరుగుబాటు చేసి బిజెపి కూటమితో జట్టు కట్టిన నాయకుల భవిష్యత్తు గురించే నా ఆందోళన. అందులో కొందరు ఇడి కేసులను ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రిందటే ప్రధాని మోడీ ఒక ప్రకటన చేశారు. ఎన్‌సిపి ఫినిష్‌ అని అన్నారు. అందుకేనేమో కొందరు నాయకులు భయపడి ఎన్‌డిఎలో చేరారు. మా పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేసినందుకు సంతోషిస్తున్నా. మహారాష్ట్ర ప్రజలపై.. ముఖ్యంగా యువతపై నాకు విశ్వాసముంది. ప్రజల వద్దకే వెళ్లి తేల్చుకుంటా.' అని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.
ఆరుగురే మిగిలినా... నిరాశ లేదు..
'1980లో నేను నాయకత్వం వహించిన పార్టీలో 58 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో కొందరు పార్టీపై తిరుగుబాటు చేశారు. ఆఖరికి ఆరుగురు మాత్రమే నావెంట ఉన్నారు. కానీ నేను నిరాశ చెందలేదు. పార్టీని బలపరిచా. నన్ను వెన్నుపోటు పొడిచినవారు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. నాకు కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్‌ చేశారు. నేను ఈ రోజు జరిగిన పరిణామాల పట్ల చింతించట్లేదు.' అని శరద్‌ పవార్‌ అన్నారు.
మహారాష్ట్రకు త్వరలో కొత్త ముఖ్యమంత్రి
మహారాష్ట్ర ప్రభుత్వంలో అజిత్‌ పవార్‌ చేరడం.. ఏక్‌నాథ్‌ షిండే ముఖ్యమంత్రి పదవి కోల్పోవడానికి నాంది అని శివసేన (ఉద్ధవ్‌ గ్రూపు) నాయకులు సంజరు రౌత్‌ అన్నారు. మహారాష్ట్రకు త్వరలోనే కొత్త ముఖ్యమంత్రి వస్తారని ఆయన చెప్పారు. అజిత్‌ బిజెపితో జట్టు కడతారని తమకు ముందే తెలుసునని ఆయన పేర్కొన్నారు.