ముంబయి : ఎయిరిండియాను కొనుగోలు చేసినప్పటి నుంచి టాటా గ్రూపు ఆ సంస్థలో వరుస మార్పులను చేపడుతోంది. ఇటీవల సంస్థ లోగో, విమానాల రూపులో మార్పులు చేయగా.. తాజాగా కొత్త లోగోతో విమానాలను విడుదల చేసింది. వీటిని శనివారం సోషల్ మీడియా వేదికల్లో పంచుకుంది. ఫ్రాన్స్‌లోని టౌలోసి వర్క్‌షాప్‌లో కొత్త లోగో, డిజైన్‌తో కొత్తగా డిజైన్ చేసిన ఎ350 విమానం చిత్రాలను విడుదల చేసింది. త్వరలోనే ఈ విమానాన్ని భారత్‌కు తీసుకు రానున్నట్లు పేర్కొంది. 2023 డిసెంబరు నుంచి కొత్త లోగోతో కొన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని... 2025 నాటికి ఎయిరిండియాలోని అన్ని విమానాలను కొత్త లోగోలోకి మార్చనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.