బాలలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని, మానసిక వికాసాన్ని కలిగించేదే బాలసాహిత్యం. అలాంటి సదుద్దేశంతో రాసిన నవల 'ఆహో ఓహో ఇకిగారు'. ప్రజాశక్తి చిన్నారి శీర్షికలో ధారావాహికగా ప్రచురితమైన 'ఆహా ఓహౌ ఇకిగారు' ... ఇప్పుడు పుస్తక రూపంలో మన ముందుకు వచ్చింది. ఈ పుస్తకం 9వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల అబ్బాయి అన్వేష్ కథ. మొబైల్ ఫోన్ వాడకమే ప్రపంచంగా బతుకుతుండే అన్వేష్ జీవితంలో అతని అత్తమ్మ పూర్ణిమ రూపంలో వచ్చిన మార్పులే ఈ నవల ఇతివృత్తం. తన కుమారుడిలో మొబైల్ ఫోన్ వాడకం తగ్గించడం ఎలా అన్న అన్వేష్ తండ్రి రత్నాకర్ ప్రశ్నకు జవాబుగా వాడిని తనతో పాటు విదేశాలకు తీసుకు వెళ్ళమని సూచిస్తుంది సైకాలజీ స్టూడెంట్ పూర్ణిమ. ఆ ప్రకారమే అన్వేష్‌ని తన బిజినెస్ ట్రిప్‌లో తీసుకువెళతాడు రత్నాకర్. ఆ విధంగా అన్వేష్ ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాలను దర్శిస్తాడు. అంతకుముందే తన అత్తమ్మతో కలిసి మైసూర్ దగ్గర ఉన్న కరంజి సరస్సు మధ్యలో ఉన్న ద్వీపాన్ని దర్శిస్తాడు. ఆ ద్వీపంలో ఎన్నెన్నో సీతాకోకచిలుకలను చూస్తాడు. ఆ ద్వీపానికి 'అందాల సీతాకోక చిలుకల ద్వీపం' అని పేరు ఉన్నట్టు తెలుసుకొని ఆశ్చర్యపోతాడు.
తండ్రితో కలిసి ముందుగా జపాన్‌లోని ఒకినోవా ద్వీపం చూస్తాడు. దక్షిణ జపాన్, తైవాన్ ల మధ్య ఉన్న ఆ దీవి పేరు ఒకినోవా. అక్కడి వారికి ఇకిగారు ఉంటుందని విని, దాని అర్థం తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. ఆ దీవిలో నివసించే వారంతా వద్ధులతో సహా నిత్యం కష్టించి పనిచేస్తూ ఉంటారని తెలుసుకుంటాడు. వాళ్లంతా 90 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు అయినప్పటికీ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ కనిపిస్తారు. అవన్నీ అన్వేష్‌లో ఆలోచన రేకెత్తిస్తాయి. తరువాత తండ్రితో కలిసి ఇటలీలోని ప్రసిద్ధ పీసా గోపురం చూస్తాడు. దాని విశేషాలన్నీ కూడా తెలుసుకొని అబ్బురంగా మదిలో దాచుకుంటాడు.
తరువాత ఇజ్రాయిల్ దేశ రాజధాని జెరూసలెం వెళతాడు. అక్కడ మృత సముద్రాన్ని సందర్శించి, దానికా పేరు ఎలా వచ్చిందో తెలుసుకుంటాడు. ఆ సముద్రం మీద నడిస్తే కూడా మనుషులు మునిగిపోరని తెలిసి ఆశ్చర్యపోతాడు. ఆ సముద్రం మీద పడుకొని పుస్తకాన్ని చదివి అనుభూతి పొందుతాడు. తరువాత నెదర్లాండ్ రాజధానిఅంస్టర్ డ్యామ్ నగరంలోని వింతలూ విశేషాలు చూస్తాడు. అక్కడ పెద్ద చిన్న కాలువలు 165 ఉంటాయని, వాటి మీద 1281 వంతెనలు ఉంటాయని తెలుసుకొని మరింత ఆశ్చర్యపోతాడు. ఆ నగరాన్ని కాలువల నగరం అంటారని కూడా తెలుసుకుంటాడు.
తరువాత తండ్రితో కలిసి ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం చేరుకుంటారు. అక్కడ రంగులు మార్చే కొండను చూస్తాడు. ఆ కొండ రంగులు మార్చడం వెనుక ఉన్న శాస్త్రీయ కోణాన్ని కూడా తెలుసుకుంటాడు. తరువాత చైనా రాజధాని బీజింగ్ వెళతాడు. అక్కడ చైనా గోడను దర్శిస్తాడు. చైనా చక్రవర్తి క్వీన్ షి హుయాంగ్ చిన్న చిన్న రాజ్యాలు అన్నిటినీ ఏకం చేసి చైనా సామ్రాజ్యాన్ని స్థాపించాడని, మంగోలుల దాడులను ఎదుర్కోవడానికి చైనా ఉత్తర భాగంలో భారీ గోడను నిర్మింపచేసాడని, దానినే చైనా గోడ అని పిలుస్తారని తెలుసుకున్నాడు.
తరువాత అతడు జోగినాధం అనే ఒక వ్యక్తి చేతిలో కిడ్నాప్ కావడం, పడవ ప్రయాణం చేయడం, సముద్రంలో పడిపోవడం, ఒక దుంగ సాయంతో రక్షింపబడడం, ఎస్కిమోలను కలవడం, స్లెడ్జ్ బండిపై ప్రయాణించడం, మాస్కో నగరం చేరుకోవడం ... అలా అనేక మలుపులు తిరుగుతుంది నవల. ఈ నవలలో అన్వేష్ అనేకమార్లు తనకు ఎదురైన ప్రమాదాలను చాకచక్యంతో తప్పించుకుంటాడు. తనకు ఎంతో ఇష్టమైన మొబైల్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యటన మీద దృష్టి పెడతాడు. ఈ నవల చదివించడం ద్వారా రచయిత బాలలను వేరొక ప్రపంచంలోకి తీసుకువెళ్లాడు. అనేక వింతైన ప్రదేశాలను పరిచయం చేశారు.
ఈ నవల చదవడం మొదలు పెడితే చివరి వరకు ఆగకుండా చదువుతారు పిల్లలు. మొబైల్ ఫోన్ వినియోగించడం వల్ల కలిగే మానసిక వికాసం కంటే కొత్త ప్రాంతాల్లో పర్యటించడం, అరుదైన కట్టడాలను, ప్రాంతాలను దర్శించడం వల్ల ఎక్కువ సమాచారం, విజ్ఞానం దొరుకుతుందని గ్రహిస్తారు. ఈ నవలా రచయిత పిల్లల మేలుకోరి అందించిన మంచి పుస్తకం ఇది. పిల్లలు ఈ పుస్తకాన్ని చదివి ప్రయోజనం పొందాలి. ఈ నవలను చదివించడం తమ బాధ్యతగా తల్లిదండ్రులు గుర్తించి తమ పిల్లలచే తప్పక చదివించాలి.
ఈ పుస్తకం కావలసినవారు నవరత్న బుక్ హౌస్, విజయవాడ వారిని ఫోన్లో 98480 82432 సంప్రదించవచ్చు.
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు










