Jun 20,2022 15:28

న్యూఢిల్లీ :   అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకాన్ని నిరసిస్తూ పలు సంఘాలు, రాజకీయ పార్టీలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో... పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. హైఅలర్ట్‌ను ప్రకటించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశాయి. మరోవైపు భారత్ బంద్ తో  రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం దేశవ్యాప్తంగా 529 రైళ్లు రద్దయినట్లు తెలిపింది.  ఇందులో 181 మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కాగా... 348 ప్యాసింజర్‌ రైళ్లు ఉన్నాయి. ఇక నాలుగు మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, ఆరు ప్యాసింజర్‌ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. రద్దయిన వాటిలో 71 రైళ్లు ఢిల్లీకి రాకపోకలు సాగించే ప్రయాణికులవేనని సమాచారం. ఇటీవల తెలంగాణ, బీహార్‌, యుపిలో రైల్వే బోగీలకు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారడంతో ఒకరు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. రైల్వే స్టేషన్‌లలో భద్రతను కట్టుదిట్టం చేశాయి.