ఎన్నో రోజులు తరబడి
ఈ మట్టి గొంతు కోసినా
పోరుపాట చిగురిస్తూనే ఉంది
ఆ అడవి కాళ్ళు నరికినా
ఉద్యమనడక సాగుతూనే ఉంది
అదిగో.. ఆ నింగి మెడలు తుంచినా
ఆత్మగౌరవం కురుస్తూనే ఉంది
అమాయకంగా ఎగిరిపోతున్న
మా ఆయువు గాలులు
అగ్గివానలై కసిగా కురవకపోవు
మీ చీకటిదాడుల కంచెలు దాటి
ఈశాన్య కొండలంచుల్లోంచి
పవిత్ర రక్తమరకలంటిన
సరికొత్త పోరు సూరీడు
ఏదొక పొద్దు ఉదయించకపోడు
పశువులనేమో అమ్మలంటూ
మా అమ్మలనేమో పశువుల్లెక్క
నగ్నంగా ఈడ్చుకుపోయే
మీ నీతిమాలిన గాలూపులకి
గుప్పెడు ఆకులు పూలు తప్ప
నింగిలోని చుక్కలు రాలవు !
మా తోబుట్టువుల మానాలే
మీ సిగ్గులేని అముఖాలకు
ముసుగులయ్యే రోజు
హౌరుగ పారే వారి ముట్టు ధారల్లో
మీ ఉత్తుత్తి ఊపిరిగుడ్డలు
రంగుమారి వేల సమూహాలుగా
కొట్టుకుపోయే క్షణం రానే వస్తుంది
దేశభక్తి వేషం గట్టిన మీరు
నగ్నంగా ఊరేగిస్తూ
ఊరి చివర ఊపిరి తీసేసింది
మా ఆడబిడ్డలనే కాదు
మీ కసాయి ధర్మం సాక్షిగా
సిగ్గుతో సగం చచ్చిన
ఈ దేశమాతని కూడా !
ఇప్పుడు బోసిమొలల చిత్రపటమే
మువ్వన్నెల జెండాగా మారి
రాజ్యాంగంపై నమ్మకంతో
తడితడిగా తలవంచుకొనెగురుతోంది !
- మిరప మహేష్
9948039026










