Oct 28,2023 21:24

వారం రోజుల్లో 2.36 బిలియన్‌ డాలర్ల క్షీణత
ముంబయి : భారత విదేశీ మారకం నిల్వల్లో మళ్లీ తగ్గుదల చోటు చేసుకుంది. ఈ నెల 20తో ముగిసిన వారంలో 2.36 బిలియన్‌ డాలర్లు క్షీణించాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) వెల్లడించింది. దీంతో అక్టోబర్‌ 20 నాటికి దేశంలోగల ఫారెక్స్‌ నిల్వలు 583.53 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు అక్టోబర్‌ 6 నుంచి 13 మధ్య 1.153 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. వరుసగా నెల రోజులకుపైగా పడిపోయిన విదేశీ మారకపు నిల్వలు.. ఒక్క వారం పెరిగినట్టే పెరిగి తిరిగి పతనం కావడం గమనార్హం. దీంతో సెప్టెంబర్‌ 1 నుంచి ఈ నెల 20 వరకు 15 బిలియన్‌ డాలర్లకు పైగానే దేశీయ ఫారెక్స్‌ నిల్వలు పడిపోయినట్లయ్యింది.
మనదేశ ఎగుమతులు పడిపోవడం, దిగుమతులు పెరగడంతో ఇటీవల కాలంలో రిజర్వ్‌ నిధులపై ఒత్తిడి పెరిగింది. డాలర్‌తో రూపాయి విలువ తగ్గడం, విదేశీ చెల్లింపుల భారం పెరగడం మారకం నిల్వలు కరిగిపోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. విదేశీ మారకం నిల్వలు తగ్గడం ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరం. రూపాయిపై ఒత్తిడి నెలకొంటుంది. ముడి చమురు దిగుమతులు భారమవుతాయి. ద్రవ్యోల్భణం భారీగా పెరుగుతుంది. నిత్యావసర వస్తువులుసహా వివిధ వస్తువులు, సేవలపై పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో రిజర్వ్‌ బ్యాంకు వద్ద పసిడి నిల్వలు పెరిగాయి. గత వారం రోజుల్లో 1.85 బిలియన్‌ డాలర్లు పెరిగి 45.42 బిలియన్లకు చేరుకున్నాయి.