May 23,2023 11:08

చెన్నైలో తొరైపాక్కమ్‌కు చెందిన లక్షయ్ కృష్ణ కుమార్‌ అందరి పిల్లాడిలా కాదూ... మానసిక ఎదుగుదల సమస్యతో బాధపడుతున్నాడు. అయినా 11 ఏళ్ల వయస్సుకే సముద్రంలో సుమారు మూడు గంటల పాటు స్విమ్మింగ్‌ చేసి, సంగీతం నేర్చుకుని, అందులో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించాడు.

లక్షయ్ కృష్ణ మూడేళ్ల వయస్సులో ఉన్నప్పుడు అతని కదలికలో మార్పులను తల్లిదండ్రులు ఐశ్వర్య, కృష్ణకుమార్‌ గుర్తించారు. వైద్యులను సంప్రదించగా ఆటిజంతో బాధపడుతున్నట్లు తెలిపారు. చాలా విషయాల్లో స్పందించని లక్షయ్ కొన్ని విషయాల్లో హైపర్‌యాక్టివ్‌గా ఉండటంతో అతన్ని భరించడం కష్టంగా ఉండేది. దాంతో వైద్యులను సంప్రదించగా చైల్డ్‌ పాథాలజిస్ట్‌లు, ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌లు చేయించమని నిపుణులు సూచించారు. స్విమ్మింగ్‌లో శిక్షణ ఇవ్వమని కోరారు. కాని లక్షయ్ తండ్రి ఆ వైపుగా ఆలోచన చేయలేదు. ఓ రోజు కుటుంబం మొత్తం కలిసి విహారయాత్రకు బీచ్‌కు వెళ్లారు. అక్కడ లక్షయ్ నీళ్లలో మునిగి, ఆడుకుంటూ ఉత్సాహాన్ని కనబరిచారు. అది గమనించిన తండ్రి చెన్నైలోని యాధావి స్పోర్ట్స్‌ అకాడమీ ఫర్‌ స్పెషల్‌ నీడ్స్‌లో చేర్చారు. కోచ్‌ సతీష్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో స్విమ్మింగ్‌లో శిక్షణ తీసుకున్నారు.
 

                                                                                     శిక్షణలో...

మొదట్లో భయపడిన లక్షరు అంచెలంచెలుగా కోచ్‌ చెబుతున్న అంశాలను గుర్తు పెట్టుకోవడం, ఆచరించడం మొదలుపెట్టి ఈతలో సామర్థ్యాలను పెంపొందించుకున్నాడు. కొద్ది రోజుల్లోనే హెడ్‌-డౌన్‌ స్ట్రోక్‌, బట్టర్‌ ఫ్లై స్ట్రోక్‌, బ్రెస్ట్‌ స్ట్రోక్‌ల్లో నైపుణ్యం సాధించాడు. స్విమ్మింగ్‌కు వెళుతున్న దగ్గర నుంచి లక్షరులో చాలా మార్పు వచ్చిందని తల్లి ఐశ్వర్య గుర్తించింది. కొన్ని నెలల తర్వాత స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. కొచ్చి స్విమథాన్‌లో జరిగిన పోటీల్లో పాల్గొని 2 కి.మీల దూరాన్ని ఒక గంట,30 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అక్టోబరు 2022లో పూణేలో జరిగిన 5 కి.మీ ఈతని 3 గంటల 33 నిమిషాల్లో పూర్తి చేశాడు. ఎప్పటికప్పుడు తన లక్ష్యాన్ని పెంచుకుంటూ శిక్షణ తీసుకున్నాడు. తర్వాత అదే 5 కి.మీ. దూరాన్ని 2 గంట 40 నిమిషాల్లో పూర్తిచేసి ప్రేక్షకులను విస్మయానికి గురి చేశాడు. ఆటిజం ఉన్న లక్షరు అవిశ్రాంత ప్రయత్నాలు విశేషమైన ప్రతిఫలాలను ఇచ్చాయి. ఈ మార్పు అతని తల్లిదండ్రులు ఊహించలేదు. సముద్రం, సరస్సుల్లో ప్రాక్టీసు సెషన్‌ల్లో పాల్గొన్నాడు. 15 కిలోమీటర్ల ఓపెన్‌ వాటర్‌ ఈత కొట్టాలనుకున్నాడు. అప్పుడు శిక్షణ ఇచ్చిన కోచ్‌ వెనకాడారు. లక్షరు మాత్రం స్విమ్మింగ్‌ చేస్తానని నమ్మకం ఇచ్చాడు. దాంతో మూడు నుంచి నాలుగు గంటలు ఈత కొట్టగల సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. అతనిపై పూర్తి విశ్వాసంతో గత నెల 30న చెన్నైలో జరిగిన పోటీల్లో పాల్గొని, నీలంకరై నుంచి మెరీనా బీచ్‌లోని ఐకానిక్‌ కన్నగి విగ్రహం వరకు సుమారు 15 కి.మీ. లను 3 గంటల18 నిమిషాల్లో పూర్తి చేసి ఆసియా బుక్‌ఆఫ్‌ రికార్డులో ఎక్కడంతో పాటు అందరి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం లక్షరుకు మాటలు కూడా స్పష్టంగా పలకలేడు. అయినా సంగీతం నేర్చుకునేందుకు సంవత్సరం క్రితం ఆసక్తి కనబరిచాడు. దాంతో వాళ్ల అమ్మ రోజూ క్లాసులకు తీసుకెళ్లి, తీసుకొస్తూ ఉంటుంది. ఆమె ప్రోత్సాహంతో తమిళ థారు వజ్తు పాటను అద్భుతంగా పాడతాడు. పియానో వాయించడం కూడా నేర్చుకుంటూ తోటి పిల్లలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.