
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ముస్లింలీగ్ (ఎన్) అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా స్వదేశీ గడ్డపై అడుగుపెట్టారు. వివిధ కేసుల్లో కోర్టు విచారణలు ఎదుర్కొంటున్న షరీఫ్ గత నాలుగేళ్లుగా లండన్‌లో ఉంటున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్ నేతలతో లండన్ నుంచి సౌదీ అరేబియా మీదుగా దుబాయ్ చేరుకున్న షరీఫ్ అక్కడి నుంచి ప్రత్యేక ఛార్టెడ్ విమానంలో పాకిస్థాన్‌కు బయల్దేరారు. ఇస్లామాబాద్ చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.మరోవైపు పాక్ సైన్యంతో లోపాయికారీగా రాజీ పడటం వల్లనే నవాజ్ స్వదేశానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోర్టు కేసులు ఎదుర్కొంటున్న నవాజ్ కోసం న్యాయపరంగా, రాజకీయపరంగా పలు సవాళ్లు ఇక్కడ కాచుకు కూర్చున్నాయి. ఏవెన్ ఫీల్డ్, అల్ అజీజియా అవినీతి కేసుల్లో ఆయనకు ఈ నెల 24 వరకు ఇస్లామాబాద్ హైకోర్టు ముందస్తు బెయిలు ఇచ్చింది. తోషాఖానా, వాహనాల కేసులో ఆయనపై అరెస్టు వారెంటును అవినీతి నిరోధక కోర్టు అదే తేదీ వరకు రద్దు చేసింది. ఈ భరోసాలతోనే నవాజ్ అరెస్టు భయం లేకుండా పాక్‌లో తిరిగి కాలు మోపగలిగినట్లు సమాచారం.