Dec 05,2022 08:12

లే !
బట్టలు మార్చుకో
ఇంట్లోనుండి బయటికి రా
అయిందేదో అయింది...
రాత్రి గడిస్తే పగలు
ఈ రోజు దాటితే రేపు
అయిందేదో అయింది...

ఊపిరి
లోపల కొట్టుకున్నంత కాలం
ఆకలి
కడుపుల్ని దహిస్తున్నంత వరకు
దప్పికతో
గొంతుకలెండి పోతున్నంత దాకా
చరిత్ర అంటే ఇదే
నాగలి భుజాన పెట్టు
పొలం వైపు కదులు
అయిందేదో అయింది...
వచ్చిపోయే బాటల్లో
ఆ నెత్తురు కళ్ళాపులు చల్లి
మృగాలు అలిసిపోయాయి
కట్టె పేళ్ళలాగా
మళ్ళీ పొయ్యిల్లో జ్వలించు
అయిందేదో అయింది...

ఎందరో చనిపోయారు
ఎందుకు
సర్వం కోల్పోయారు
ఎందుకు
అయిందేదో అయింది ఎందుకు
జీవన స్వప్నాల్లో మాయం
ప్రశ్నలు రేపే కల్లోలం
మందిరాల్లో
దేవుడిని కీర్తిస్తూ భజనలు
మసీదుల్లో
ఆహ్వానిస్తూ ఆజాలు
అసలు మనిషెక్కడ
మనిషి కోసం
మరో విరహగీతం
అయిందేదో అయింది...
హిందీ మూలం : నీదా ఫాజ్‌ లీ
తెలుగు అనువాదం : గడియారం శ్రీవత్స
'కంజిర' పొయిట్రీ బులెటిన్‌ ఆరవ సంచికని, 1992 డిసెంబర్‌ ఆరున బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన తర్వాత వచ్చిన కవితలతో ప్రచురించాము. దీనిని 1993 ఆగస్టులో వెలువరించాము. ఇందులో అప్పటికే పత్రికల్లో వచ్చినవి, అచ్చు కానివీ కలిపి మొత్తం 31 కవితలు వేశాము. 28 మంది తెలుగు కవులవి, నీదా ఫాజ్‌ లీది ఒకటి, సుదీప్‌ బెనర్జీవి రెండు కవితల అనువాదాలు కూడా చేర్చాము. ఈ సంచికే అన్నింటిలోకీ ఎక్కువ పుటలతో వచ్చింది. ఇవీ వెనుక అట్ట మీద కె.శ్రీనివాస్‌ గారి వాక్యాలు :
వాస్తవాస్పదం!
రాముడు అక్కడే పుట్టాడు - ఒక నమ్మకం
బాబరు గుడి కూల్చి మసీదు కట్టాడు
- ఒక వివాదం
కరసేవకులు మసీదు ధ్వంసించారు
- ఒక నిజం.
 

- నామాడి శ్రీధర్‌