Oct 24,2023 10:31

వరల్డ్‌ కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు ఆల్‌ రౌండ్‌ షోతో మరో సంచలన విజయం నమోదు చేసుకుంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో పాకిస్తాన్‌పై ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాక్‌ మొదట 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది. ఆఫ్ఘన్‌ 49 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్ని అందుకుంది. 283 పరుగుల ఛేజింగ్‌లో ఆఫ్ఘన్‌ టాపార్డర్‌ అదరగొట్టింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీం జాద్రాన్‌ తొలి వికెట్‌కు 130 పరుగులు చేయగా.. రహ్మత్‌ షా, కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది జట్టును విజయతీరాలకు చేర్చారు. రహ్మనుల్లా గుర్బాజ్‌ 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌ తో 65 పరుగులు చేయగా, మరో ఓపెనర్‌ ఇబ్రహీం జాద్రాన్‌ 113 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 10 ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరూ అవుటైన తర్వాత రహ్మత్‌ షా, హష్మతుల్లా షాహిది మరో వికెట్‌ పడకుండా జట్టును గెలిపించారు. రహ్మత్‌ షా 84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు చేయగా, షాహిది 45 బంతుల్లో 48 పరుగులు చేశాడు. పాక్‌ బౌలర్లలో షహీన్‌ అఫ్రిది 1, హసన్‌ అలీ 1 వికెట్‌ తీశారు.