Nov 03,2023 22:18

లక్నో: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. దాదాపు సెమీస్‌ ఆశలు వదులుకున్న జట్లయిన ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌ జట్లు సెమీస్‌ బెర్త్‌ దిశగా పయనిస్తున్నాయి. లక్నో వేదికగా శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు 7వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించడం ద్వారా ఆఫ్ఘన్‌ జట్టు కూడా 8 పాయింట్లతో 5వ స్థానానికి ఎగబాకింది. ఆఫ్ఘనిస్తాన్‌ ఏడు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మూడు, నాలుగో స్థానాల్లో ఉన్న ఆసీస్‌, న్యూజిలాండ్‌ ఖాతాలో కూడా 8 పాయింట్లే ఉన్నా.. నెట్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటంతో ఆ రెండు జట్లు టాప్‌-3, 4లో నిలిచాయి. ఆఫ్ఘన్‌ జట్టు సెమీస్‌కు చేరాలంటే చివరి రెండు లీగ్‌ మ్యాచుల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలను ఓడించడం తప్పనిసరి. ఆ రెండు మ్యాచుల్లో ఆఫ్ఘన్‌ గెలిస్తే ఆ జట్టు క్రికెట్‌ చరిత్రలో నూతన అధ్యాయం లిఖించడం ఖాయం. మరోవైపు పాకిస్తాన్‌ సెమీస్‌ రేసులో నిలవాలంటే నేడు న్యూజిలాండ్‌ను ఓడించాల్సిందే.