ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ మొదటి వారంలో నిర్వహించబోయే 22వ నంది నాటక పోటీలకు కే.గంగవరం మండలం అద్దంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు పి. శ్రీనివాసు ఎంపికయ్యారు. పద్య నాటక విభాగంలో నంది అవార్డుల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి 28 నాటక సమాజాలు పోటీ పడగా, అందులో తుది పోటీలకు 10 పద్యనాటకాలను ఎంపిక చేశారని, వాటిలో కాకినాడకు చెందిన శ్రీ సీతారామాంజనేయ నాట్యమండలి వారు ప్రదర్శించిన సీతా కళ్యాణం అనే పౌరాణిక రంగస్థల పద్య నాటకం నంది నాటకోత్సవాలలో తుది ప్రదర్శనకు ఎంపికైనట్లు తెలిపారు. ఆ నాటకంలో తాను దశరధుని పాత్ర పోషిస్తున్నానని ఆయన తెలియజేశారు. ఈనెల 17వ తేదీన కాకినాడలోని దంటు కళాక్షేత్రంలో ముగ్గురు సభ్యులతో కూడిన నంది పద్య నాటకాల ఎంపిక కమిటీ (జ్యూరీ) ధ్వర్యంలో ప్రాథమిక పోటీలు జరిగాయి. జ్యూరీ కమిటీ సభ్యులు ప్రదర్శనను తిలకించి నంది నాటకోత్సవాలలో తుది ప్రదర్శనకు పి. శ్రీనివాసును ఎంపిక చేశారు. ఆయన గతంలో చారిత్రక పరిశోధన, సామాజిక సేవ, సాంస్కృతిక కళా రంగాలలో వీరు చేసిన సేవలకు గుర్తింపుగా 2014లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయఅవార్డును అందుకున్నారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తూ, మరోవైపు రంగస్థల కళాకారునిగా రాణిస్తూ నంది నాటక పోటీలకు ఎంపిక కావడం పట్ల కే.గంగవరం మండలం విద్యాశాఖ అధికారులు ఏ. నాగరాజు, సిహెచ్. ఆంజనేయులు, అద్దం పల్లి గ్రామ సర్పంచ్ చింతపల్లి లక్ష్మి, అద్దంపల్లి హైస్కూల్ ఉపాధ్యాయులు శ్రీనివాసును అభినందించారు.










