మాకు అమ్మా నాన్నలు
బొడ్డుకోసి పేరు పెడతారు
చెంచయ్య చెంచమ్మ అని
ఆ లెక్కన వనదేవత పురుడు పోసినట్టు
మేము అడవి తరపు ప్రతినిధులం
మాది అడవిని పోలిన మనసు
పొద్దుకూపడే పచ్చదనం యొక్క కాంతిలో
పిచ్చెలాట ఆడేవాళ్ళు ఆడుకుంటుంటే
చెట్లను పొదిగిన అడవి కిరీటం మీద
కొందరు తుమ్మెదల్లా తిరుగుతుంటారు
మా ఆకలి గూర్చి అడవికి తెలుసు
చిగురు కొమ్మమీద గువ్వల్లా బతుకుతున్నాం
అవి తమ పొట్ట పట్టేంత తిని కూస్తుంటాయి
మేము చిన్న కమతాల్లో పొట్టపోసుకుంటాము
కానీ అడవి సజీవంగానే ఉంది
మా దగ్గర వాగులు వంకలు స్వచ్ఛంగానే ప్రవహిస్తున్నాయి
కిరణాలకు కాలుష్యం చుట్టుకోలేదు
ఇంకా,కొండల్ని మేసే మేఘాల్ని చూస్తూ
వర్షంలో తడుస్తూ శ్రమిస్తున్నాము
సాలీళ్ళ నేతపనితనమంతా నీరుగారుతున్నట్లుంది మా శ్రమ
రాళ్ళ మధ్య ముళ్ళ మధ్య మా నడక నడిచారా ఎపుడైనా
ఒట్టికాళ్ళలో ఎన్ని ముళ్ళున్నాయో
గూడెంలో అన్ని వేలిముద్రలున్నవి
పొయ్యి కిందికి రెండు కట్టెపుల్లలేరుకునే వాళ్ళం
చందనం కట్టెలతో మాకేం పని
కొన్ని రొట్టెలు, రొట్టెలనిచ్చే భూముంటే చాలు!
ఇంకా పొగచూరిన గుడిసెల్లో
బూడిద కళ్ళతో మా స్త్రీలు
పక్కా ఇంటి పట్టా కోసం వెతుకుతున్నారు
ఇలా ప్రతీది వెతుక్కునే ఆ కళ్ళేమి వ్యాఖ్యానిస్తాయో అదే నిజం
మా పూర్వీకులు మమ్మల్ని పట్టుకోమని ఒక కొమ్మ ఇస్తారు
అది అనాది దుఃఖ భరిత చెట్టు నుండి ఇంచుకున్నది
ఈ హక్కులు కోల్పోయిన బతుకెందుకని ఎవరినడగాలి
ఇప్పుడూ అన్నిటికంటే ఆకలి భయమే ఎక్కువ!
పగటిశ్రమ చీకట్లో కలిసిపోవడానికి
మా పాటలు మాకున్నారు
మా ఆటలు మాకున్నారు
మా మధ్య చలిమంట
డప్పుల ధ్వనుల్లో పెరుగుతున్న గుండెనిబ్బరం
వాయిద్య శబ్దం పుంజుకుంటుంది
ప్రతి ఆరోహణలో
ఒదులు జుత్తు ఊగుతుంది
పాదాలు నర్తనధూళితో నిండిపోతాయి
అడవి నేపథ్యాన్ని అదే నేపథ్యంలో పాడుతుంటాం
అంబులెన్స్ రాలేని దారిలో
ఇన్నాళ్ళకెవరో ...
అడవిని అమ్మేసేవారు
మమ్మల్ని గూడెం విడిచి పొమ్మంటున్నారు
ఒక ప్రశ్న ఉరిసే పైకప్పులా ఇబ్బంది పెడుతూ వుంది
మేము ఎక్కడికి వెళ్ళి ఎలా బతగ్గలం?
దీనిపై మాకు అర్జీ ఎవరు రాసిస్తారు?
- శాంతయోగి యోగానంద
91107 70545










