Jul 25,2023 15:03
  • అధికారులకు రైతుల వినతి

ప్రజాశక్తి - ముద్దనూరు(కడప) : ఆరుగాలం కష్టపడి సాగు చేసే పంట పొలాలను అడవి పందులు నాశనం చేస్తున్నాయని అడవి పందుల బెడదను అరికట్టేందుకు అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు, వైసిపి నాయకులు కోరారు. అరికట్టాలని రైతులు అటవీశాఖ అధికారులను కోరారు. స్థానిక అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం వైసిపి మండల కన్వీనర్‌ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఫారెస్ట్‌ రేంజర్‌ అశోక్‌ కుమార్‌ యాదవ్‌, డిఆర్‌ఒ చంద్ర శేఖర్‌ రావును కలిసి సమస్య వివరించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మండలంలో అడవి పందుల బెడద ఎక్కువగా ఉందన్నారు. పందులు పొలాల్లో పడి పంటలు నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎఫ్‌ఆర్‌ఒను కోరారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌ఒ అశోక్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. అడవి పందులు, జంతువుల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అడవి పందులు, జంతువుల బారి నుండి పంటలు కాపాడుకునేందుకు సోలార్‌ సిస్టం లైటింగ్‌, పులి, మనిషి అరిచే అరుపు లాగా శబ్దాలు వచ్చే ఎలక్రిటికల్‌ పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిని పొలాల్లో, కంచె వద్ద ఏర్పాటు చేసుకోవాలన్నారు. దీంతో అవి పొలాల్లోకి వచ్చేందుకు భయ పడతాయన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ పరికరాలను సబ్సిడీ ద్వారా అందిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పంటలు కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మాదన్నగారిపల్లి సర్పంచ్‌ జయరాంనాయిడు, వైసిపి నాయకులు శంకర్‌ రెడ్డి, విశ్వనాథరెడ్డి, వీరప్రతాప్‌, శివారెడ్డి, వేణుయాదవ్‌, సంజీవరెడ్డి, బాలవీరయ్య, కుడాలయ్య, మల్లేష్‌, నాగరాజ రెడ్డి, రామచంద్ర రెడ్డి, ఫారెస్టు బీట్‌ రత్నరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.