న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్లో అదాని గ్రూపు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అదాని సంస్థ మోసపూరిత చర్యలకు పాల్పడుతోందని, మనీ లాండరింగ్ చేస్తోంటూ అమెరికన్ సంస్థ హిండెన్‌బర్గ్ ఇచ్చిన పరిశోధనాత్మక నివేదికతో భారత మార్కెట్లు విలవిలలాడుతున్నాయి. రెండు రోజుల్లో 10.65 లక్షల కోట్ల రూపాయల సంపదను ముదుపర్లు కోల్పోయారు. అదానీకి చెందిన 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ రూ.4 లక్షల కోట్లు ఆవిరయింది. శుక్రవారం ఒక్కరోజో ఈ సంస్థలు మూడు లక్షల కోట్ల రూపాయల మేర నష్టం చవిచూశాయి. జనవరి 24న అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ విలువ రూ19 లక్షల కోట్లుగా ఉండగా.. జనవరి 27 ముగింపు నాటికి రూ.15 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. అదానీ షేర్లలో అమ్మకాల వల్ల ఎల్‌ఐసి దాదాపు రూ.18వేల కోట్ల నష్టాన్ని చవి చూసింది. అదానీ గ్రూపులోని కంపెనీల్లో జనవరి 24 నాటికి ఎల్‌ఐసి పెట్టుబడి రూ.81,268 కోట్లుగా ఉండగా.. 27 నాటికి ఇది రూ.62,621 కోట్లకు పడిపోయింది. ఇంత భారీ నష్టం జరిగినా ఎల్‌ఐసి నుండి మరో 300 కోట్ల రూపాయలను అదాని గ్రూపునకు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమౌతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదాని ఎంటర్‌ప్రైజెస్ కొత్తగా విడుదల చేయనున్న ఎఫ్‌పిఓలో ఎల్‌ఐసి ఈ మేరకు పెట్టుబడులు పెట్టనుందని సమాచారం. దీంతో అదాని గ్రూపులో ఎల్‌ఐసి పెట్టుబడులు మరో 4.23శాతం మేర పెరగనున్నాయి. సంక్షోభం వేళ ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వ రంగ సంస్థయైన ఎల్‌ఐసి సిద్దపడటం వెనుక ప్రభుత్వ వర్గాల ఒత్తిడి ఉందని భావిస్తున్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ చేపట్టిన రూ.20,000 కోట్ల ఎఫ్‌పిఓ శుక్రవారం ప్రారంభమైంది. ఇది జనవరి 31 వరకు కొనసాగనుంది. ఎఫ్‌పిఒలో ఒక్కో షేరును రూ.3,112 - రూ.3,276 ధరల శ్రేణిలో విక్రయించాలని నిర్ణయించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం షేరు ధర ఎఫ్‌పిఒ ధర కంటే కిందకు చేరి రూ.2,768 వద్ద నమోదవుతోంది.
కుబేర స్థానం పతనం
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దెబ్బకు అత్యంత కుబేరుడైనా గౌతం అదానీ సంపద కీలకమైన 100 బిలియన్ల మార్క్‌కు దిగువకు పడిపోయింది. రెండు రోజుల్లో ఆయన కంపె నీల షేర్ల పతనంతో ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీ ర్యాంకింగ్ ఏడో స్థానానికి పడిపోయింది. ఇంతక్రితం ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఓ దశలో రెండో స్థానానికి ఎగబాకగా.. చాలా కాలం మూడో స్థానంలో కొనసాగారు.











