Feb 21,2023 21:48

- పెయిడ్‌ ఎడిటర్లతో అసత్య కథనాలు
- హెచ్చరికల నోటిఫీకేషన్లను తొలగించిన వైనం
- అక్రమాలన్నీ అదానీ ఐపి అడ్రస్‌ల నుంచే
- వికీపీడియా 'ది సైన్‌పోస్ట్‌' ప్రత్యేక కథనం

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సన్నిహితుడు, బడా కార్పొరేట్‌ సంస్థ అదానీ గ్రూపు మరో అక్రమం వెలుగులోకి వచ్చింది. స్వతంత్ర మీడియాగా విశ్వవ్యాప్తంగా తనదైన ముద్ర వేసుకున్న వికిపీడియాలోనూ అదానీ గ్రూపు అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలస్తున్నాయి. సాధారణంగా వికిపీడియాలో ప్రజలే కంటెంటు రాస్తారు. వాటిని సేవాభావంతో పనిచేసే ఎడిటర్లు వాస్తవాలు సరిచూసి పోస్టు చేస్తుంటారు. కానీ అదానీ ఈ స్వతంత్ర వేదికను కూడా పెయిడ్‌ ఎడిటర్లను నియమించుకొని కలుషితం చేశారన్నది ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అక్రమం. వికీపీడియాలోని సమాచారాన్నీ ఏమార్చి.. గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబ సభ్యులు, గ్రూప్‌ కంపెనీలకు సంబంధించి పక్షపాతంతో కూడిన కంటెంట్‌ను యాడ్‌ చేశారనీ, వికీలో హెచ్చరికలనూ తొలగించారని వికీపీడియానే స్వయంగా పేర్కొంది. ఇందుకోసం తోలుబమ్మ ఖాతాలను, పెయిడ్‌ ఎడిటర్లను వినియోగించారని తెలిపింది. ఇలా కంటెంట్‌లో మార్పు చేసిన వారిలో అదానీ గ్రూప్‌ కంపెనీ ఉద్యోగులూ ఉన్నారని తెలిపింది. ఈ మేరకు వికీపీడియాకు చెందిన న్యూస్‌ పేపర్‌ ది సైన్‌పోస్ట్‌ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది.
అదానీ గురించి 2007లో ఆర్టికల్స్‌ మొదలయ్యాయని, అవన్నీ ముక్కుసూటిగా ఉండేవని వికీపీడియా తెలిపింది. కానీ 2012లో ముగ్గురు ఎడిటర్లు దానికి సంబంధించిన కంటెంట్‌లో మార్పులు చేశారని, వార్నింగ్‌ నోటిఫికేషన్లను సైతం వారు తొలగించారని వికీపీడియా పేర్కొంది. ఇలా 9 ఆర్టికల్స్‌ను రూపొందించిన/ సవరించిన 40 మంది పెయిడ్‌ ఎడిటర్లు, సాక్‌పప్పెట్స్‌ను బ్లాక్‌ చేసినట్లు వికీపీడియా తెలిపింది. ఇలా ఎడిట్‌ చేసిన వారిలో అదానీ గ్రూప్‌ కంపెనీ ఉద్యోగులూ ఉన్నారని పేర్కొంది. అదానీ గ్రూప్‌ ఐపీ అడ్రస్‌లను కూడా తాము గుర్తించామని పేర్కొంది.
'అదానీ గ్రూప్‌నకు చెందిన ఓ పెయిడ్‌ ఎడిటర్‌ ఆ కంపెనీకి సంబంధించి ఆర్టికల్‌నే పూర్తిగా మార్చివేశారు. ఇదంతా అదానీ గ్రూప్‌ ఐపీ అడ్రస్‌ నుంచే జరిగింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన వార్నింగ్‌లను కూడా తొలగించారు. వికీపీడియా క్వాలిటీ కంట్రోల్‌ సిస్టమ్స్‌కు సైతం దొరక్కకుండా కొన్ని ఆర్టికల్స్‌ను రూపొందించారు'' అని వికీపీడియా పేర్కొంది. ఇలాంటి ఆర్టికల్స్‌ను రివ్యూ చేసేందుకు ఉన్న రివ్యూయర్‌ అయిన హాచెన్స్‌ తన స్థానాన్ని దుర్వినియోగం చేశారని, అతడిపై నిషేధం విధించామని వికీపీడియా పేర్కొంది. వికీపీడియాలో వచ్చిన ఈ కథనాన్ని హిండెన్‌బర్గ్‌ రీసెర్చి వ్యవస్థాపకుడు నాథే ఆండర్సన్‌ ట్వీట్‌ చేశారు. వికీపీడియాను సైతం ఏమార్చారంటూ ఆయన పేర్కొన్నారు. వికీపీడియాలో గతంలోనూ పలువురు బిలీయనీర్లు ఇలా పెయిడ్‌ ఎడిటింగ్‌లకు పాల్పడ్డ ఉదంతాలు ఉన్నాయని ఈ సందర్భంగా వికీపీడియా తెలిపింది. అయితే వికీపీడియా విమర్శలపై అదానీ గ్రూప్‌ స్పందించలేదు.