న్యూఢిల్లీ : అదాని గ్రూపు కంపెనీలకు దీర్ఘకాలం ఆడిటర్‌గా వ్యవహారించిన 'ఇవై' సంస్థపై భారత అకౌంటింగ్ రెగ్యులేటరీ విచారణ ప్రారంభించిందని సమాచారం. కొద్ది వారాల క్రితం నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఎ) ఇవై సంస్థకు చెందిన భారత సంస్థ ఎస్‌ఆర్ బాట్లిబోయిపై విచారణ చేపట్టిందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ చేసింది. ఎన్‌ఎఫ్‌ఆర్‌ఎ విచారణకు ఎంత సమయం పట్టవచ్చు లేదా ఆడిటర్, అదాని కంపెనీలు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది అస్పష్టంగా ఉంది. ఈ అంశంపై స్పందించేందుకు ఇవై, ఎస్‌ఆర్ బాట్లిబోయి ప్రతినిధులు నిరాకరించారు. అదాని గ్రూపులోని ఐదు లిస్టెడ్ కంపెనీలు మొత్తం ఉత్పత్తిలో సగం రెవెన్యూను కలిగి ఉన్నాయి. వాటికి ఎస్‌ఆర్ బాట్లిబోయి ఆడిటర్ సేవలను అందిస్తున్నాయి. అదాని గ్రూపు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిందని పేర్కొంటూ ఈ ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల చేయగా, ఆ ఆరోపణలను అదాని ఖండించింది. ఆరోపణలపై సెబీతో సుప్రీంకోర్టు విచారణ జరిపిస్తోంది. ఇది ఆడిటర్ల పారదర్శకతపై మరింత ఒత్తిడి పెంచింది. ఈ పరిస్థితుల్లో బాట్లిబోయిపై విచారణ చర్చనీయాంశమైంది.