Feb 22,2023 08:28
  • రాష్ట్రంలో కేటాయించిన భూముల సంగతేంటి ?


అదాని గ్రీన్‌లో ఈ ఏడాది పెట్టనున్న పెట్టుబడులను సమీక్షించాలని ఆ సంస్థ నిర్ణయించింది. హిండెన్‌బెర్గ్‌ నివేదిక, అనంతర పరిణామాల నేపధ్యంలో ఆ సంస్థ పెట్టుబడుల్లో భారీ కోతలు తప్పవని సమాచారం. తన ముదుపర్లకు కూడా ఆ సంస్థ ఇదే సమాచారమందించింది. మరోవైపు అదాని గ్రీన్‌ ఎనర్జీకి పెద్దఎత్తున భూములు కట్టబెడుతూ ఈ నెల 8వ తేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 406.46 ఎకరాలు, కడప జిల్లాలో 470 ఎకరాలు, మన్యం పార్వతీపురం జిల్లాలో 362 ఎకరాలు కేటాయిస్తూ ఆరోజు జరిగిన మంత్రి మండలి సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి దాదాపు రెండు వారాల ముందే హిండెన్‌బెర్గ్‌ అదాని అక్రమాలపై విడుదల చేసిన నివేదిక దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆ సంస్థ ప్రాజెక్టుల సంగతేంటి? ప్రభుత్వం కేటాయించిన భూముల పరిస్థితి ఏమిటి ?

ప్రజాశక్తి - న్యూ ఢిల్లీ : పెట్టుబడి వ్యయాన్ని సమీక్షించాలన్న అదానీ గ్రీన్‌ ఎనర్జీ నిర్ణయం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఆ సంస్థతో భారీ ఒప్పందాలు చేసుకోవడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూ కేటాయింపులు కూడా పెద్దఎత్తున చేసింది. ఇప్పుడు వాటిలో ఎన్ని అమలులోకి వస్తాయన్న అంశం చర్చనీయాంశంగా మారింది. హిండెన్‌బెర్గ్‌ నివేదిక నేపథ్యంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో అదాని సంబంధాలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో రాష్ట్రంలోనూ అదానికి భారీ ఎత్తున లబ్ధి చేకూరిందన్న వార్తలు వస్తున్నాయి. అలా రాష్ట్రంలో భారీ ప్రయోజనాలు పొందిన అదాని ప్రాజెక్టులలో అదాని గ్రీన్‌ ఎనర్జీ కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వ విధానాల్లో భాగంగా ప్రత్యామ్నాయ విధ్యుత్‌ వనరులను వెతుక్కోవడం రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పనిసరిగా మారింది. ఈ సమయంలోనే దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ ఎనర్జీ సంస్థగా ఆవిర్భవించిన అదాని గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఎజిఇఎల్‌) రాష్ట్రంలో కాలిడింది. ఆ సంస్థ అడిగిందే తడువుగా రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు ఇవ్వడంతో పాటు, భారీ ఎత్తున భూ కేటాయింపులు చేసింది. అక్రమాల ఆరోపణలు వచ్చిన తరువాత కూడా ఈ పందారం సాగడం గమనార్హం. షేర్ల విలువ భారీ పతనం, రేటింగ్‌ సంస్థలు ర్యాంకింగ్‌లను తగ్గిస్తున్న నేపథ్యంలో అదాని గ్రూపులోని వివిధ సంస్థలు తమ ప్రణాళికలను సమీక్షిస్తున్నాయి. పెట్టుబడి లక్ష్యాలను కుదించాలని నిర్ణయిస్తున్నాయి. ఆ జాబితాలో తాజాగా అదాని గ్రీన్‌ ఎనర్జీ చేరింది. 2023-24 సంవత్సరంలో ఖర్చు చేయతలపెట్టిన 10వేల కోట్ల రూపాయల పెట్టుబడి వ్యయాన్ని సమీక్షించాలని ఆ సంస్థ నిర్ణయించింది. వాస్తవానికి 2023-24తో పాటు 2024-25లో కూడా పది వేల కోట్ల రూపాయలను పెట్టుబడి వ్యయంగా ఖర్చు చేయనున్నట్లు హిండెన్‌బెర్గ్‌ నివేదికకు వారం రోజుల ముందు ఆ సంస్థ ప్రకటించింది. అయితే, ఆ నివేదిక విడుదల తరువాత భారీ మార్పు వచ్చింది. 'మా లక్ష్యాలు నెమ్మదించే అవకాశం ఉంది. పెట్టుబడి వ్యయపు అంచనాలను సమీక్షించి, కొంత మేర తగ్గించాలని భావిస్తున్నాం' అంటూ ఫిక్స్‌డ్‌ ఇన్‌కం ఇన్వెస్టర్లకు తెలియచేసింది.
 

                                                                    మన రాష్ట్రం సంగతేంటి ?

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 3,700 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కోసం అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ముందుకొచ్చింది. నాలుగు దశల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్లకు 15,376 కోట్ల రూపాయలను ఆ సంస్థ ఖర్చు చేయాల్సిఉంది. దీనికోసం 11,000 ఎకరాలు అవసరమవుతాయని దశల వారిగా ఈ మేరకు కేటాయింపులు చేయాలని నిర్ణయించారు. స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపిబి) ఇచ్చిన అనుమతుల ప్రకారం 2022-23లోనే ఆ సంస్థ 1,349 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సిఉండగా, అందులో నామమాత్రపు మొత్తాన్ని కూడా వ్యయం చేయలేదని సమాచారం. అదే సమయంలో భూముల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదముద్ర పడకముందే వాటిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని తాడిమర్రి మండలంలో ఈ నెల 8వ తేదిన భూములు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోగా అంతకు నెల రోజుల ముందు నుండే ఆ భూముల్లో అదాని సిబ్బంది పనులు చేయడం ప్రారంభించారు.ఎకరా ఐదు లక్షల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు పెట్టుబడి వ్యయాన్నే సమీక్షిస్తున్న నేపథ్యంలో ఏ ప్రాజెక్టులను కొనసాగిస్తారు? వేటికి ప్రాధాన్యత ఇస్తారన్న విషయంలో స్పష్టత లేదు. ఆ స్పష్టత లేకుండా భూములు అప్పగిస్తే అటు పరిశ్రమలు రాక, ఇటు భూములు సాగు లేని ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పటికే లేపాక్షి నాలెడ్జి పార్కు, నెల్లూరు జిల్లాలో థర్మల్‌ ప్లాంట్లకు చేసిన కేటాయింపులు, వాన్‌పిక్‌ భూముల విషయంలో ఇదే పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల అదాని గ్రీన్‌ ఎనర్జీకి భూములను లీజుకిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. లీజుకిచ్చినా ఆచరణలో అదాని పరం చేయడమేననన విషయాన్ని వారు దాచి పెడుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో లీజు చెల్లించడంలో విఫలమైతే ఎలా అన్న ప్రశ్నకు వారి నుండి సమాధానం రావడం లేదు.