Nov 02,2023 21:01

లాభాల్లో 51 శాతం పతనం
రెవెన్యూలో 41 శాతం క్షీణత
న్యూఢిల్లీ : గౌతం ఆదానికి చెందిన కీలక కంపెనీ అదాని ఎంటర్‌ప్రైజెస్‌ ఆర్థిక ఫలితాలు డీలా పడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 50.5 శాతం పతనంతో రూ.227.82 కోట్ల నికర లాభాలకు పరిమితమయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.460.94 కోట్ల లాభాలు నమోదు చేసింది. కాగా.. 2023 జూన్‌ త్రైమాసికం లాభాలు రూ.673.93 కోట్లతో పోల్చితే ఏకంగా 66.1 శాతం పతనాన్ని చవి చూసింది. గడిచిన క్యూ2లో అదాని ఎంటర్‌ప్రైజెస్‌ రెవెన్యూ 41 శాతం క్షీణించి రూ.22,517.33 కోట్లుగా చోటు చేసుకుంది. గతేడాది ఇదే కాలంలో రూ.38,175.23 కోట్ల రెవెన్యూ ఆర్జించించింది. గడిచిన త్రైమాసికంలో కంపెనీ వాణిజ్య మైనింగ్‌ నష్టాలు రూ.340 కోట్లకు పెరిగాయి. 2022 ఇదే జులై- సెప్టెంబర్‌లో రూ.132 కోట్ల నష్టాల్లో ఉంది. అదాని ఎంటర్‌ప్రైజెస్‌లో ఎనర్జీ, వంట నూనెలు, అహారోత్పత్తులు, రక్షణ, స్టోరేజీ, లాజిస్టిక్‌ సహా పలు ప్రాథమిక పరిశ్రమలు భాగంగా ఉన్నాయి.