- ప్రపంచ కుబేరుల్లో స్థానం పతనం
- 40 బిలియన్ డాలర్లకు మార్కెట్ విలువ
న్యూఢిల్లీ : ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న గౌతం అదాని ప్రపంచ కుబేరుల్లో 30వ స్థానానికి పడిపోయారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ దెబ్బకు అదాని గ్రూపు కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ 40 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. జనవరి 24 నాటికి అదాని గ్రూపు కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ 120 బిలియన్ డాలర్లుగా ఉండగా.. గడిచిన నెల రోజుల్లో 65 శాతం లేదా 80 బిలియన్ డాలర్లు ఆవిరయ్యింది. దీంతో సోమవారం నాటికి ఈ సంపద 39.9 బిలియన్ డాలర్లకు పడిపోవడంతో.. ప్రపంచ కుబేరుల్లో అదాని 30వ స్థానానికి పడిపోయారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. అదాని గ్రూపు కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ రెండేళ్ల కనిష్టానికి పడిపోయిందని తెలిపింది. ఇంతక్రితం 2021 ఫిబ్రవరిలో ఈ స్థాయిలో అదాని గ్రూపు కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ నమోదయ్యింది. అదాని గ్రూపు కంపెనీలు తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాయని.. ఎకౌంట్స్ మోసాలు, కృత్రిమంగా స్టాక్ మార్కెట్‌లో షేర్లను పెంచుకుంటున్నాయని, డొల్ల కంపెనీలతో లావాదేవీలు నెరవేర్చుతున్నాయని హిండెన్‌బర్గ్ రిపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అదాని షేర్ల పతనం కొనసాగుతూనే ఉంది. సోమవారం సెషన్‌లోనూ అదాని గ్రూపు కంపెనీల షేర్లు క్షీణించాయి. అదాని ఎంటర్‌ప్రైజెస్ 9.17 శాతం, అదాని పవర్, అదాని గ్రీన్, అదాని ట్రాన్స్‌మిషన్, అదాని టోటల్ గ్యాస్, అదాని విల్మర్ సూచీలు 5 శాతం చొప్పున పతనమయ్యాయి. అదాని 10 స్టాక్స్‌ల్లో ఒక్క అదాని పోర్ట్స్ మాత్రమే స్వల్పంగా పెరిగింది. మిగితావన్నీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. కాగా.. ఈ స్టాక్స్ పట్ల రిటైల్ మదుపర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.










