- ఎకరా ఆరేడు లక్షలకే ఇవ్వాలని అధికారుల హుకుం
- రూ.20 లక్షలు కోరుతున్న 'సాగరమాల' నిర్వాసితులు
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : 'సాగరమాల' అభివృద్ధి పేరుతో ప్రభుత్వం రైతుల నుంచి కారుచౌకగా భూములను స్వాధీనం చేసుకుంటోంది. ఎకరాకు ఆరేడు లక్షల రూపాయల కంటే ఎక్కువ ఇచ్చేది లేదని గ్రామసభల్లో రెవెన్యూ ఉన్నతాధికారులు తేల్చి చెప్తున్నారు. కనీసం రూ.20 లక్షలు ఇవ్వాలని నిర్వాసిత రైతులు కోరుతున్నారు. తిరుపతి జిల్లాలోని నాలుగు మండలాల్లో 21 గ్రామాల పరిధిలో 725 ఎకరాలను 'సాగరమాల' ప్రాజెక్టుకు ప్రభుత్వం సేకరిస్తోంది. కృష్ణపట్నం ఓడరేవు నుంచి తిరుపతి జిల్లాలోని నాయుడుపేట-బెంగళూరు రహదారిని కలుపుతూ 'సాగరమాల' ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణం జరగనుంది.
జిల్లాలో చిల్లకూరు, కోట, ఓజిలి, నాయుడుపేట మండలాల్లో రైతుల నుంచి ప్రభుత్వం భూములను సేకరిస్తోంది. అధికారులు గ్రామసభలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఇటీవల ఓజిలిలో జరిగిన గ్రామసభలో రెవెన్యూ అధికారులు ఎకరాకు ఆరేడు లక్షలు ఇస్తామని, కలెక్టర్ చొరవతో మరో రెండు మూడు లక్షల రూపాయలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అంతకంటే ఎక్కువ ఇచ్చేది లేదని తేల్చి చెప్తున్నారు. ఈ భూములే తమకు జీవనాధారమని, ఏటా మూడు పండే ఈ భూములు ఎకరా 20 లక్షలపైనే ధర పలుకుతోందని రైతులు తెలిపారు.
నష్టపరిహారం పెంచాలి
ఓజిలి మండలం కురుగొండ గ్రామంలో 43 మంది రైతులు 42.6 ఎకరాల భూములు కోల్పోతున్నారు. ఈ భూముల్లో ఏడాదికి మూడు పంటలు పుష్కలంగా పండుతున్నాయి. బోర్ల ద్వారా మేము పంటలు సాగు చేసుకుంటున్నాము. పంట భూముల్లో జాతీయ రహదారి రావడం వల్ల సన్న, చిన్న కారు రైతులు సాగు భూములను కోల్పోయి రోడ్డున పడనున్నారు. నష్టపరిహారం పెంచాలి.
-వై.భాస్కర్‌రెడ్డి, కురుగొండ గ్రామం, ఓజిలి మండలం
సమస్య పరిష్కరించాకే రహదారి ఏర్పాటు
కృష్ణపట్నం ఓడరేవుకు జాతీయ రహదారి ఏర్పాటు చేస్తూనే గ్రామస్తులకు ఆటంకం కలగకుండా సర్వీసు రహదారులు ఏర్పాటు చేయాలి. వరదల సమయంలో మామిడి కాలువ పొంగి రైెతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి. నీరు పారేందుకు వీలుగా అడ్డంకులు లేకుండా చూడాలి. రైతులు కోరిన నష్టపరిహారం చెల్లిస్తే జాతీయ రహదారి ఏర్పాటుకు మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు.
-ఎన్.సురేష్, కురుగొండ గ్రామం, ఓజిలి మండలం
రైతుల విన్నపాలు విన్నాం
సాగరమాల ప్రాజెక్టు పరిధిలో గ్రామసభలు పెట్టి రైతులకు వివరిస్తున్నాం. మేము ప్రకటించిన నష్టపరిహారం చాలదని వారు చెబుతున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే సమస్య పరిష్కరిస్తాను.
-కిరణ్‌కుమార్, సబ్‌కలెక్టర్, గూడూరు










