- ఘటన జరిగిన 18 నెలల్లో తీర్పు
ప్రజాశక్తి-ఒంగోలు క్రైం : ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, అనంతరం హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ.. ప్రకాశం జిల్లా ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. 2021 జులై 8న గిద్దలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంబవరం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కుమార్తె (7) తోటి ఆడపిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్లి.. రాత్రయినా తిరిగి రాలేదు. తల్లిదండ్రులు పరిసరాల్లో వెతికినా కనిపించలేదు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గిద్దలూరు సిఐ ఫిరోజ్ తన సిబ్బందితో చిన్నారి వివరాలు సేకరించి గాలించగా గ్రామ శివారులోని డ్రయినేజీ కాల్వలో ప్లాస్టిక్ సంచిలో చిన్నారి మతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై గిద్దలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల విచారణలో బాలికకు దగ్గరి బంధువైన అదే గ్రామానికి చెందిన 30 ఏళ్ల సిద్ధయ్యను నిందితుడిగా గుర్తించారు. చిన్నారి కనిపించకుండా పోయిన రోజు నుంచే ఇతనూ గ్రామం విడిచి వెళ్లిపోవడంతో ఈ నేరంలో సిద్ధయ్య పాత్రపై అనుమానం వచ్చి సిఐ ఒంగోలు నుంచి క్లూస్ టీమ్‌ను పిలిపించి.. విచారించగా.. అతడే నిందితుడిగా తేలింది. దిశ డిఎస్‌పి ధనుంజయుడు కేసు తదుపరి దర్యాప్తును చేపట్టి 48 గంటల్లో సిద్ధయ్యను అరెస్టు చేశారు. చిన్నారికి డబ్బు ఆశ చూపి.. ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డానని సిద్ధయ్య ఒప్పుకున్నాడు. బయటకు పొక్కితే అరెస్టు అవుతానని భావించి.. చిన్నారిని హత్య చేశానని చెప్పాడు. చిన్నారి మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి సైకిల్‌పై తీసుకెళ్లి గ్రామ శివారులోని డ్రయినేజీ కాల్వ పొదల్లో పడేసి పారిపోయినట్లు తెలిపాడు. అతనిపై పోలీసులు పోక్సో చట్టం-2012 కింద కేసు నమోదు చేసి.. ప్రకాశం జిల్లా ప్రత్యేక కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 18 నెలల వ్యవధిలో కేసు పూర్వాపరాలను పరిశీలించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సోమశేఖర్ నిందితుడికి ఉరి శిక్ష విధించారు.










