Feb 18,2023 10:30

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఉపాధి హామీపై కేంద్ర ప్రభుత్వం మరో వేటు వేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉపాధి హామీకి రూ.30 వేల కోట్ల కేటాయింపుల్లో కోత పెట్టింది. ఇప్పుడు వేతనాల కోసం ఆధార్‌ ఆధారిత చెల్లింపులను బలవంతం చేస్తుంది. ఇది అమలు చేయడం వల్ల ప్రభుత్వ డేటా ప్రకారమే 57 శాతం మంది కార్మికులు వేతనాలకు దూరం అవుతారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం కింద వేతనాల పంపిణీకి ఆధార్‌-రూటెడ్‌ చెల్లింపు వ్యవస్థను తప్పనిసరి చేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జనవరి 30న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం 2023 ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వస్తుందని మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ ధరంవీర్‌ ఝా లేఖలో పేర్కొన్నారు. కార్మికులు తమ ఖాతాను తమ ఆధార్‌ నంబర్‌తో లింక్‌ చేయాలని వారి బ్యాంకులను అభ్యర్థించాలి. దీని తరువాత, నౌ యువర్‌ కస్టమర్‌ వివరాలను సమర్పించిన తరువాత ఖాతాను నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియలో ఖాతాదారుని బయోమెట్రిక్‌ ప్రమాణీకరణ కూడా ఉంటుంది. 43 శాతం మంది కార్మికులకు మాత్రమే ఎబిపిఎస్‌ సౌకర్యం ఉంది. ఉపాధి హామీ అమలును నిశితం గా పరిశీలిస్తున్న జీన్‌ డ్రేజ్‌ వంటి ఆర్థికవేత్తలు, 57 శాతం మంది కార్మికులు ఆధార్‌-ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఎబిపిఎస్‌)లో భాగం కారని చెప్పారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి 100 రోజుల వరకు పని కల్పించే జాతీయ ఉపాధి హామీ చట్టం కింద ప్రజలను పని డిమాండ్‌ చేయకుండా నిరోధించడానికి మోడీ ప్రభుత్వం తీసుకున్న మరో అడుగు అని విమర్శించారు. ఇప్పుడు కార్మికులకు బ్యాంకు, పోస్టల్‌ ఖాతాల ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. ఎబిపిఎస్‌ని అనుసరించడం గజిబిజిగా ఉండే ప్రక్రియ అని ఆర్థికవేత్త డ్రెజ్‌ అన్నారు. కొత్త వ్యవస్థను ముందుకు తీసుకురావడం వెనుక హేతుబద్ధతను ఆయన ప్రశ్నించారు. ''సాధారణ బ్యాంకు ఖాతాలకు చేసిన చెల్లింపు కంటే ఎబిపిఎస్‌ ద్వారా చెల్లింపు మెరుగ్గా ఉంటుందని ఎటువంటి ఆధారాలు లేవు. ఇది మెజారిటీ కార్మికులకు పని లేకుండా చేసే నిర్లక్ష్య నిర్ణయమని ఆయన అన్నారు. ''ఎబిపిఎస్‌తో చాలా సంక్లిష్టత ఉంది. అందుకే చాలా మంది కార్మికులు ఇంకా చేయలేదు'' అని డ్రెజ్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ హాజరు తప్పనిసరి అనే కొత్త విధానంతో ఉపాధి హామీ కార్మికులు ఇప్పటికే ఎదుర్కొంటున్న సమస్యలను కార్యకర్త నిఖిల్‌ డే ఎత్తి చూపారు. ''పని ప్రదేశంలో కార్మికుడి ఫోటో తీయాలి. మొబైల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ ప్రక్రియ అస్తవ్యస్తమైన ఇంటర్నెట్‌ కనెక్టివిటీ కారణంగా నిలిచిపోయింది'' అని అన్నారు.
 

                                              ఉపాధి హామీని రద్దు చేయకుండా చంపేస్తోంది: బి.వెంకట్‌

ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఎన్‌ఆర్‌ఇజిఎ చట్టాన్ని అధికారికంగా రద్దు చేయకుండా చంపేస్తోందన్నారు. అందులో భాగంగా బడ్జెట్‌ కేటాయింపుల కోత, ఆన్‌లైన్‌ హాజరు తప్పనిసరి వంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇప్పుడు కార్మికులను పనికి దూరం చేసేందుకు ఆధార్‌ ఆధారిత చెల్లింపులను తప్పనిసరి చేసిందని పేర్కొన్నారు. ఉపాధి హామీ కోసం 2023-24 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.60,000 కోట్లు కేటాయించిందని, ఇది 2022-23లో సవరించిన కేటాయింపుల కంటే రూ.30,000 కోట్లు తక్కువగా ఉందని చెప్పారు.