Sep 06,2023 21:24
  •  ఛాన్సలర్‌ హోదాలో హాజరవుతున్న రాష్ట్ర గవర్నర్‌
  •  ముఖ్య అతిథిగా జిఎంఆర్‌ సంస్థల అధినేత జిఎం రావు
  •  అల్లూరి ఇంద్రకుమార్‌, కొలకలూరి ఇనాక్‌లకు గౌరవ డాక్టరేట్‌లు

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖ) : ఆంధ్ర విశ్వవిద్యాలయం 87, 88, 89, 90వ సంయుక్త స్నాతకోత్సవం ఈ నెల 9న నిర్వహించనున్నట్లు వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య పివిజిడి.ప్రసాదరెడ్డి తెలిపారు. ఎయు స్నాతకోత్సవ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. స్నాతకోత్సవానికి ఛాన్సలర్‌ హోదాలో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్య అతిథిగా జిఎంఆర్‌ సంస్థల అధినేత, ఎయు పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక చైర్మన్‌ జిఎం.రావు హాజరుకానున్నారని తెలిపారు. పరిశ్రమలు - శాస్త్ర రంగంలో అవంతి ఫీడ్స్‌ సంస్థ ఎండి అల్లూరి ఇంద్రకుమార్‌ (డిఎస్‌సి), సాహిత్యం-కళా రంగాలలో ఎస్‌వి.యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి కొలకలూరి ఇనాక్‌ (డిలిట్‌)కు గౌరవ డాక్టరేట్లను అందించనున్నట్లు చెప్పారు. డాక్టరేట్లు 690 మంది, మెడల్స్‌ 600 మంది అందుకోనున్నారని తెలిపారు. కోవిడ్‌ కారణంగా స్నాతకోత్సవం రెండు పర్యాయాలు వాయిదా పడిందన్నారు. మిగిలిన రెండు స్నాతకోత్సవాలను సైతం త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు.

కొలకలూరి ఇనాక్‌కు గౌరవ డాక్టరేట్‌

అసాధారణ సాహితీమూర్తి డాక్టర్‌ కొలకలూరి ఇనాక్‌కు ఆంధ్ర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. ఈయన 1959లో అదే యూనివర్సిటీ నుంచి బిఎ ఆనర్స్‌ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచే అధ్యాపకులుగా ప్రస్థానం ప్రారంభించారు. తన 85వ ఏట అదే విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకోనున్నారు. చదివిన యూనివర్సిటీ, చదువు చెప్పిన యూనివర్సిటీలో ప్రతిష్టాత్మక గౌరవం పొందడం అరుదైన గౌరవం.