Nov 04,2023 12:40

ప్రజాశక్తి-కాకినాడ : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (ఏపీడబ్ల్యుజేఎఫ్‌) హర్షం వ్యక్తం చేస్తుందని కాకినాడ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాతాడ నవీన్‌ రాజ్‌, ముమ్మిడి లక్ష్మణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద శనివారం ఏపీడబ్ల్యూజేఫ్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు స్వీట్స్‌ పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం నవీన్‌ రాజ్‌, లక్ష్మణ్‌ లు మాట్లాడుతూ ... రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల హామీల్లో భాగంగా జర్నలిస్టులకు 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పడం శుభ పరిణామామన్నారు. గత నాలుగున్నరేళ్లుగా అనేకసార్లు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడం జరిగిందన్నారు. దీపావళి పండుగలోపు కార్యరూపం దాల్చి సంక్రాంతి పండుగ కానుకగా జర్నలిస్ట్‌ లకు స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ, జిల్లా పౌరసంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ నాయకులు బిందాన సురేష్‌, వీధి గోపీనాథ్‌, వాసంశెట్టి శ్రీనివాస్‌, పుర్రె త్రినాధ్‌, హస్సేన్‌, గోవింద్‌, దొరబాబు, విజరు, ప్రసాద్‌, సుబ్బారావు, మంగా కృష్ణ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.