May 29,2023 13:25
  •  రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు

ప్రజాశక్తి - యంత్రాంగం : అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ, చిన్నపత్రికలకూ అక్రిడేషన్‌ కార్డులు, బస్సు పాసులు ఇవ్వాలని, ఇళ్లస్థలాలతో పాటు బీమా వర్తింపజేయాలని, అక్రిడేషన్‌ కమిటీలో జర్నలిస్టుల యూనియన్‌ను చేర్చాలని, జర్నలిస్టులపై దాడులు జరగకుండా ఉండేందుకు హైపర్‌ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు రోడెక్కారు. ఉత్తమ వార్తలు, కథనాలు రాసే వారికి ఏటా అవార్డులు ప్రకటించాలని, ఉద్యోగ విరమణ చేసిన జర్నలిస్టులకు పెన్షన్‌ ఇవ్వాలని నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యుజెఎఫ్‌), ఆంధ్రప్రదేశ్‌ బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ (ఎపిబిజెఎ) ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్‌ డే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టారు. అనంతరం అధికారులకు సమస్యలతో కూడిన వినతిపత్రాలు అందజేశారు.
విజయవాడలోని ఆర్‌టిసి బస్టాండ్‌ కాంప్లెక్స్‌లోని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు, బ్యానర్‌ను చేతబట్టి జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, అక్రిడిటేషన్ల కోసం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.వెంకట్రావు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ టి.విజయకుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మీడియా అకాడమీలో ఎపిడబ్ల్యుజెఎఫ్‌, ఎపిబిజెఎలకు ప్రాతినిధ్యం కల్పించాలని, జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వాలని, ఆరోగ్య బీమా అమలుపై సమీక్షకు కమిటీ నియమించాలని కోరారు. కమిషనర్‌ స్పందిస్తూ... జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విజయవాడ కలెక్టరేట్‌లోని ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావుకు వినతిపత్రం అందించారు. జిల్లా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం త్వరలో నిర్వహించి అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని, విజయవాడ రూరల్‌ మండలం నున్నలోని ది విజయవాడ మ్యూచివల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీకి గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాన్ని స్వాధీనం చేసేందుకు ఎదురవుతున్న సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర నాయకులు ఎ.అమరయ్య, పరమేశ్వరరావు, ఎపిబిజెఎ రాష్ట్ర నాయకులు జి.వి.రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో అమీనా పేట, కోర్టు సెంటర్‌, ఫైర్‌ స్టేషన్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కెఎస్‌. శంకరరావు పాల్గొన్నారు.పోలవరంలో తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో నిరసన తెలిపారు. అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, ప్రకాశం, ఉభయగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.