May 21,2023 06:37

అమరావతి రాజధాని నుంచి ఎన్టీఆర్‌ శతజయంతి దాకా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రతి అంశమూ వివాదగ్రస్తంగా నడుస్తున్నది. పాలక పార్టీల నేతలు, వాటి అనుకూల మీడియాలు తమకు తోచినట్టు చిత్రించుతూ గందరగోళం చేస్తున్నాయి. అసహన దూషణలు, అనవసర ఘర్షణలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయ ఎజెండాలో కన్నా వృథా వివాదాలే విసుగు తెప్పించే స్థాయికి చేరుతున్నాయి. గత, ప్రస్తుత కేంద్ర రాష్ట్ర పాలకుల రాజకీయ క్రీడలో నిజంగా ఏం జరుగుతుందో ఏది ఎంతవరకూ సరైందో తెలియని అయోమయం ప్రజలను వెంటాడుతున్నది. కర్ణాటక ఎన్నికల ఫలితాల వంటి అంశాలను కూడా తమకు అనుకూలంగా మార్చుకోవడం తప్ప మౌలిక సారాంశం పట్టించుకోవడం మృగ్యమై పోయింది. ఈ క్రమంలోనే ఎన్నికల పొత్తుల కథలు కూడా పరిపరి విధాల సాగుతూ వున్నాయి.

  • ఆర్‌5 జోన్‌-కోర్టుల ఆదేశాలు

రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన రాజధాని సమస్య తీసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ఎజెండాగా మిగిలిపోవడం తప్ప ఒక పరిష్కారం గోచరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా తీసుకొచ్చిన ఆర్‌5 జోన్‌ ఏర్పాటును సుప్రీంకోర్టు, హైకోర్టు అడ్డుకోవడానికి నిరాకరించడం ఊహించిందే, ఎందుకంటే దేశంలో ఏ ప్రభుత్వమైనా పేదలకు పట్టాలిస్తామంటే వద్దని చెప్పడం జరగదు. అయితే రాజధాని పనులు నిలిపేసిన స్థితిలో ఒక సెంటు భూమి పట్టాల పంపిణీతో అయ్యేదేమిటనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది. రాజధానిలోనే కట్టి వున్న టిడ్కో ఇళ్ల పంపిణీ విషయం తేల్చకుండా కొత్త పట్టాల హడావుడి ఏమిటని సిపిఎం నేతలు అడగాల్సి వచ్చింది. రాజధాని ప్రాంత గ్రామాల్లోని పేదలందరికీ ఈ సెంటు పట్టాలు ఇవ్వాలని వారు అడిగారు. రాజకీయ వివాదాలలో తీవ్రంగా మాట్లాడే పార్టీలు అక్కడకు వెళ్లి ఆ విషయం అడిగింది లేదు! జెఎసి తరపున కేసులు నడపడం తప్ప ఖచ్చితంగా దీనిపై నిలదీయడానికి టిడిపి కూడా సిద్ధపడలేదు. అమరావతిపై ఇంతకాలం మాట్లాడిన వారు ఎన్నికల నాటికి ఒకడుగు వెనక్కువేయడం ఊహించదగిందే. మూడు రాజధానుల పేరిట ప్రాంతాల మధ్య స్పర్థ తీసుకురావడం లేదా మూడు ప్రాంతాలనూ సంతృప్తి పర్చడం పాలకపార్టీ వ్యూహమైనప్పుడు దాన్ని సూటిగా ఎదుర్కోవడం నష్టమని మాజీ పాలక పక్షం భావిస్తుంది. వాస్తవానికి గత ఎన్నికలలో కూడా టిడిపి అమరావతి పూర్తిచేయడం అన్నది కీలకాంశంగా తీసుకోలేదు. ధర్మయుద్ధం చుట్టూ ప్రచారం నడిపించింది. ఇప్పుడు వైసిపి కూడా వేలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు అంటూ రాజధాని చర్చను మరోవైపు మళ్లించనుంది. స్తంభించిపోయిన రాజధాని ప్రాంతంలో వేలమందికి స్థలాలు ఇస్తే ఏం ప్రయోజనమన్నది మామూలుగా వచ్చే ప్రశ్న. అయితే దానికీ అమరావతి నిర్మాణానికి వైరుధ్యం ఏమిటన్నది మరింత ముఖ్యమైన చర్చ. చంద్రబాబు హయాంలో ఊరించినట్టు కాకపోతే మరో విధంగానైనా దాన్ని పూర్తి చేయాల్సింది ప్రభుత్వమే కదా అంటే జవాబు లేదు. అసలు రాజధానిని మార్చే అధికారం శాసనసభకు వుందా లేదా అనే రాజ్యాంగ మీమాంస లేవనెత్తడంతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు దాన్ని నిర్ధారించే పని చేపట్టింది. నిర్ణీత గడువు లోపల అమరావతి పూర్తి చేయాలనే హైకోర్టు ఉత్తర్వును నిలిపేసింది. అందుకే ఇది ఎడతెగని ప్రతిష్టంభనగా మారింది. ఈలోగా ఇళ్ల స్థలాల పంపిణీ తతంగం మాత్రం జరుగుతుంది. అది కూడా హైకోర్టు తుది తీర్పునకు లోబడి వుంటుంది. పేదల ఉద్ధరణకు తాము అంత పెద్ద యజ్ఞం చేస్తుంటే కమ్యూనిస్టులు కూడా సిద్ధాంతాలు వదిలేసి టిడిపికి వంత పాడుతున్నారని వైసిపి నిరాధార ఆరోపణలు చేస్తుంటుంది. అమరావతిపై టిడిపి హయాంలోనూ ఇప్పుడూ కూడా ప్రజల తరపున రాష్ట్రం కోసం ఖచ్చితమైన అభిప్రాయాలు చెబుతున్న సిపిఎం వంటి పార్టీని కూడా ఆ కోవలో కలిపి మాట్లాడటం వైసిపి ఉక్రోషాన్ని తప్ప వాస్తవాన్ని ప్రతిబింబించేది కాదు. ఇక సెంటు స్థలాలలో సమాధి కట్టుకోవాలని చంద్రబాబు వంటి వారు మాట్లాడటం కూడా అసహనాన్ని తెలియజేస్తుంది.
ఇతరత్రా చూసినా ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించినట్టు సెప్టెంబరులో విశాఖకు తన నివాసం మార్చుకోవడం తప్ప మరేమీ జరిగే సూచనలు లేవు. అన్ని పార్టీలూ అమోదించినప్పటికీ కర్నూలుకు హైకోర్టు తరలింపు ఇంతవరకూ సోది లోకి రానే లేదు! బెంచి అంటున్నా అది కూడా నిర్దిష్ట రూపం పొందింది లేదు.

  • వివేకా హత్య కేసు-సిబిఐ, మీడియా

వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు, అరెస్టులు-బెయిళ్లు, బెయిలు రద్దులు ఈ కాలంలో విపరీతంగా మీడియా చర్చలను ఆక్రమిస్తున్నాయి. స్వయంగా సుప్రీంకోర్టు ఈ కేసును పర్యవేక్షిస్తున్నది. సిబిఐ దర్యాప్తు నడిపిస్తున్నది. వివేకా కుమార్తె సునీతా రెడ్డి కోర్కె మేరకు తెలంగాణ హైకోర్టు కేసు విచారిస్తున్నది. నాలుగేళ్ల నుంచి నడుస్తున్న ఈ కేసు విషయమై మీడియాలో నాటకీయమైన కథనాలు లేదా సిద్ధాంతాలు చాలా వచ్చాయి. సిబిఐ వాటిని పరిగణన లోకి తీసుకున్నదీ లేనిదీ తెలియదు. కోర్టులు అంతిమంగా నిర్ధారించి ఆదేశించవలసి వుంటుంది. సిబిఐ నోటీసులు ఇచ్చాక ఎవరైనా హాజరు కాకుండా తప్పించుకోవడం జరగదు కూడా. అదే సమయంలో సిబిఐ తీరు సంతృప్తికరంగా లేదని సుప్రీంకోర్టు అసంతృప్తి వెలిబుచ్చిందనేది వాస్తవం. ఏది ఏమైనా ఇందులో పాత్రధారులెవరు సూత్రధారులెవరు అంటూ రకరకాల కథలు ఇరువైపుల మీడియాలో వస్తున్నా అంతిమంగా దోషులను తేల్చవలసింది న్యాయస్థానాలే. ప్రజల మౌలిక సమస్యలు మతతత్వం వంటి రాజకీయ ముప్పులను పక్కన పెట్టి ఈ కేసులోనే మునిగి తేలవలసిన అగత్యం పార్టీలకూ మీడియాకు ఏముంటుంది? కానీ దురదృష్టవశాత్తూ జరుగుతున్నది అదే. ఎవరిని విచారించినా ఎవరిని అరెస్టు చేసినా అభ్యంతరం ఎందుకుంటుంది? విచిత్రమేమంటే తన పేరుతో ఇన్ని కథనాలు వస్తుంటే సిబిఐ మాత్రం ఒక్కసారి కూడా వివరణ ఇవ్వదు. ఈ స్థాయిలో కాకున్నా మార్గదర్శి కేసులోనూ ఇలాగే ఎడతెగని వివాదం. విచారించడానికి సిఐడికి కోర్టులు అనుమతినిచ్చాక, సహకరించాల్సిందిగా సంస్థను ఆదేశించాక ఇక వివాదం ఎందుకు కొనసాగుతున్నట్టు?

  • పొత్తులు-ఎత్తులు-విపత్తులు

ఇవిగాక రాజకీయ పొత్తుల కథలు మరో తరహా. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎ.పి లో మూడు ప్రాంతీయ పార్టీలూ-వైసిపి, టిడిపి, జనసేన....బిజెపి చుట్టూ తిరుగుతున్నాయి. వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌ నిరంతరం కేంద్రం చుట్టూ ప్రధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అన్ని విధాల మద్దతునిస్తున్నారు. ప్రత్యేక హోదా పోలవరం వంటి విషయాల్లో పూర్తిగా నష్టం చేసినా ఇప్పుడు విశాఖ ఉక్కుకు ఎసరు పెట్టినా అడగడానికి సిద్ధపడటం లేదనేది నిజం. అలాంటి బిజెపితో జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ సఖ్యత నెరుపుతుంటే టిడిపి పొత్తు కోసం పాకులాడుతున్నది. కాకపోతే వైసిపి వంటరిగానే పోటీ చేస్తానంటుంటే మిగిలిన ఇద్దరూ బిజెపితో కలసి కూటమి కట్టాలని తహతహలాడుతున్నారు. చంద్రబాబు నాయుడు పనిగట్టుకుని మోడీ విజన్‌ను పొగిడి పరవశిస్తున్నారు. బిజెపి నేతలు అనేక రకాలుగా మాటలు మారుస్తూ వీరితో దాగుడుమూతలాడుతుంటే వైసిపి నేతలు పరిహాసం చేస్తున్నారు. కాని తాము కూడా బిజెపికి లోబడి వున్నామనే నిజం దాటేస్తున్నారు. ఈ మధ్యలో టిడిపి, జనసేన సంబంధాలలోనూ పవన్‌ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి చర్చ ప్రహసనంలా నడుస్తుంది. చివరకు ఆయన తమకు బలం లేదు గనక అడగడానికి అవకాశం లేదని స్పష్టం చేయవలసి వచ్చింది. కాకుంటే అసలే రెండు కులాల మధ్య చర్చగా నడుస్తున్న చోట ఈ నేపథ్యంలో కాపులు, ఇతర కులాల ప్రస్తావన కూడా పెరిగింది. బిజెపి తీసుకొచ్చిన మతతత్వ రాజకీయం తోడు కులాల లెక్కలు కూడా నిత్యకృత్యంగా మారిపోవడం అనుమతించరాని పరిణామం. వాస్తవానికి బిజెపి ప్రభావంతోనూ పొత్తు ఆశతోనూ టిడిపి, జనసేన నేతలు కూడా తరచూ ఆలయాలు, మతాల భాషలో మాట్లాడుతున్నారు. మరో వంక ముఖ్యమంత్రి జగన్‌ వారిని మించి యజ్ఞయాగాలను తలపెట్టి తనే మతభావాలను సంతృప్తి పరచాలని వ్యూహం తీసుకున్నారు. ఇవన్నీ లౌకిక ప్రజాస్వామ్యానికి చేటు చేస్తాయి. కర్ణాటక ఎన్నికలలో బిజెపి తిరస్కరణ తర్వాత కూడా మూడు పార్టీలు కళ్లు తెరవకపోవడం విపరీతం.

  • సవాళ్ల మధ్య ఎన్నికలకు...

ఈ వ్యర్థ వివాదాల మధ్య అసలైన సమస్యలుగా వున్న పోలవరం కూడా వెనక్కుపోవడం బాధాకరం. టిడిపి తప్పు చేసిందని వైసిపి, వీరిదే తప్పు అని టిడిపి తిట్టుకోవడం తప్ప అసలు కారణమైన కేంద్రాన్ని నిలదీసే పరిస్థితి లేకుండా పోయింది. పునరావాసం కోసం త్వరలో మహా పాదయత్ర జరపాల్సి వస్తున్నది కానీ వీరికి కనువిప్పు లేదు. ఏతావాతా ఈ ఎన్నికల లోపు పోలవరం మాట మర్చిపోవలిసిందేనన్నట్టు తయారైంది పాలకపార్టీల వైఖరి. ఉద్యోగ ఉపాధ్యాయుల జీతభత్యాలు, సమస్యలు కార్మికులు, రైతులు ఉద్యమాల కనీస కోర్కెలకు స్పందన లేదు. నిరుద్యోగుల ఆశలూ నెరవేరింది లేదు. సంక్షేమ పథకాల అమలు నగదు బదిలీ కింద రెండు కోట్లకు పైగా ప్రజలకు నగదు బదిలీ చేశామన్న ఒక్క అంశంపైనే ప్రభుత్వ ప్రచారం నడుస్తున్నది. ఈ మధ్యనే ముఖ్యమంత్రి కొన్ని నిర్మాణాలకు హడావుడిగా శంకుస్థాపనలు మొదలెట్టారు గాని వాటిపైనా వివాదాలున్నాయి.
ఈ వివాదాల వాతావరణంలో ఇప్పుడు టిడిపి ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం బాగా పెంచింది. వైసిపి ఆ అవకాశం, అవసరం లేదని ఖండిస్తున్నా ఊహాగానాలు ఆగడం లేదు. ముఖ్యమంత్రి ప్రసంగాల తీరు వేడి పెంచేలా సవాళ్లు చేయడం అందరూ గమనిస్తున్నారు. కీలక పదవులు నిర్వహించేవారి గురించీ భిన్న కథనాలు ఇటీవల వైసిపిని ఇబ్బంది పెట్టాయి. వైసిపి లోనూ అంతర్గత మార్పులు, చేర్పులు అసమ్మతిని పెంచడం నెల్లూరు, ప్రకాశం వంటి చోట్ల బహిరంగంగానే కనిపిస్తున్నది. టికెట్ల ఘట్టం రావడంతో టిడిపి లోనూ భిన్న వర్గాలు కలహిస్తున్న తీరు నంద్యాల ఘటనతో బయిటకొచ్చింది. ఇప్పుడున్న కుల మత వివాదాలు, పదవుల పోటీలు కేంద్ర బిజెపి కుట్రలను గమనంలో వుంచుకుని చూస్తే ఎ.పి ముందున్న సవాలు తీవ్రమైనదనే చెప్పాలి. పరస్పర కలహాలలో మునిగిన మన పాలక పార్టీలు విభజన సమస్యలను కూడా ఒక కొలిక్కి తెచ్చింది లేదు. విభజనకు పదేళ్లు పూర్తవుతుంది గనక ఆ నాటి ఏర్పాట్లకూ కాలం ముగిసిపోతుంది. అందువల్ల 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి అత్యంత కీలకమైనవే అవుతాయి.

ravi

 

 

 

 

తెలకపల్లి రవి