Nov 22,2022 11:09
  • తెలంగాణకు మొదటి స్థానం
  • రెండో స్థానంలో తమిళనాడు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : పలు ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే గ్యారంటీల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉంది. తొలి స్థానంలో తెలంగాణ ఉండగా, రెండో స్థానంలోకూడా దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు ఉండడం విశేషం. దేశం మొత్తంమీద అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి ఇచ్చిన గ్యారంటీల్లో ఈ మూడు రాష్ట్రాలదే 64 శాతం వాటా ఉండడం విశేషం. సొంత పన్నుల ఆదాయంలో 90 శాతం వరకు గ్యారంటీలు ఇచ్చుకోవచ్చునన్నది నిబంధన కాగా, గతేడాది దీనిని 180 శాతంగా పెంచుతూ రాష్ట్రం సొంత నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడమన్నది పెరిగిపోతోంది. ఆయా సంస్థలకు గ్యారంటీలు ఇచ్చి, అవి తీసుకునే రుణాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల విలువ ఏకంగా రూ. 91,330 కోట్లుగా ఉండడం గమనార్హం. అంతకు ముందు ఏడాది రూ. 77,782 కోట్లుగా ఉండగా, అది 14 వేల కోట్లవరకు పెరిగినట్లు తేలింది. రాష్ట్ర విభజన జరిగిన 2014లో ఈ గ్యారంటీలు రూ 31,152 కోట్లు ఉన్నాయి. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన 2015లో 10,657 కోట్లుగా గ్యారంటీలు నమోదయ్యాయి. 2016, 2017లో ఈ మొత్తం గ్యారంటీలు తగ్గగా, 2018 నుంచి గణనీయంగా పెరుగుదల ప్రారంభమైంది. ప్రతి యేటా దాదాపుగా రూ. 20 వేల కోట్లు వరకు పెరుగుతూ 2021 నాటికి 91 వేల కోట్లు దాటిపోయింది.
 

62 శాతం మూడు రాష్ట్రాలవే...
దేశ వ్యాప్తంగా 2021 సంవత్సరంలో 4,48,472 కోట్ల రూపాయలను గ్యారంటీగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇందులో దక్షిణాదికి చెందిన తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వాటాయే ఎక్కువగా ఉండడం గమనార్హం. తెలంగాణ రూ. 1,05,006 కోట్లు, తమిళనాడు 91,818 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ 91,330 కోట్లు కలిపి మొత్తం 2,88,154 కోట్లు గ్యారంటీలు ఇచ్చినట్లు తేలింది. ఇది మొత్తం గ్యారంటీల్లో 64 శాతంగా ఉండడం విశేషం.