Jul 26,2023 13:38

న్యూఢిల్లీ   :  ఐదు కోట్లకు పైగా ఉపాధి కూలీలను తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌) కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐదు కోట్ల మందికి పైగా కార్మికులను తొలగించినట్లు తెలిపింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ మంగళవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2021-22తో పోలిస్తే .. 2022-23లో తొలగింపులు 247 శాతం పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే సాధారణ వ్యాయామంలో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. నకిలీ జాబ్‌ కార్డు, డూప్లికేట్‌ జాబ్‌ కార్డు, పనిచేయడానికి ఇష్టపడని వారు, గ్రామ పంచాయితీల నుండి శాశ్వతంగా బదిలీ అయిన కుటుంబాలు, జాబ్‌ కార్డ్‌లో ఒకే వ్యక్తి మరియు గడువు ముగిసిన కార్డు, వ్యక్తి మరణించడం, గ్రామాలను పట్టణ పరిధిలోకి తీసుకురావడం వంటి కారణాలతో వారిని తొలగించినట్లు తెలిపారు.

అయితే మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌ జాబ్‌ కార్డులను ఆధార్‌ కార్డులతో లింక్‌ చేయడం, ఆధార్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (ఎబిపిఎస్‌) కారణాలతో తొలగింపులు జరిగినట్లు మీడియా రిపోర్టులో వెల్లడైంది. ఈ ఏడాది జూన్‌ 23 వరకు 61 లక్షల మంది రిజిస్టర్డ్‌ కార్మికులను తొలగించారు. పైగా ఈ కార్యక్రమాన్ని సరిగ్గా అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని సింగ్‌ ఆ సమాధానంలో పేర్కొనడం గమనార్హం. ఈ తొలగింపుల జాబితాలో పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం (5,199 శాతం)తో మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో వరుసగా తెలంగాణ (2727 శాతం), ఆంధ్రప్రదేశ్‌ (1147 శాతం), ఉత్తరప్రదేశ్‌ (466 శాతం), ఉత్తరాఖండ్‌ (427 శాతం ) రాష్ట్రాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ సభ్యులు గౌరవ్‌ గొగోరు, వికె. శ్రీకందన్‌లు ఈ ప్రశ్నను లేవనెత్తారు.