ప్రజాశక్తి-సుండుపల్లె : అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లె తహశీల్దార్ కార్యాలయంలో ఎసిబి అధికారులు శనివారం సోదాలు చేశారు. భూమిని ఆన్‌లైన్ చేసేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటున్న తహశీల్దార్ జి.రవి, ఆర్‌ఐ ఎం.కిరణ్‌ను పట్టుకున్నారు. తహశీల్దార్ కార్యాలయంలో సోదాల విషయం తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్న వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది కార్యాలయాల నుంచి మాయమయ్యారు. ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారు. ఎసిబి అడిషనల్ ఎస్‌పి దేవప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ.. మండలంలోని బాగంపల్లి ఎరమనేనిపాలెం గ్రామ పంచాయతీ కుంట్లముందరకు చెందిన రైతు ప్రభంజన్‌రెడ్డి భూమి 1.40 ఎకరాలను ఆన్‌లైన్ చేసేందుకు తహశీల్దార్ రవి, ఆర్‌ఐ కిరణ్ రూ.40 వేలు లంచం అడిగారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రైతు స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో ఎసిబి అధికారుల వ్యూహం మేరకు తహశీల్దార్, ఆర్‌ఐని ఎసిబి అధికారులు పట్టుకున్నారు. వారివురిని అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్‌పి తెలిపారు.










