ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ.. ఎపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఇన్సిట్యూషన్స్ సొసైటీ జాయింట్ డైరెక్టరు కెడివిఎమ్ ప్రసాద్ ఇళ్లపై ఎసిబి ఆకస్మిక దాడులు నిర్వహించింది. బుధవారం విజయవాడలోని బృందావన కాలనీలోని ఆయన ఇంటితోపాటు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారం మేరకు ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. ప్రసాద్ 1991లో హైదరాబాద్‌లో ఐటిబిపి కానిస్టేబుల్‌గా, ఎస్‌పిఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ఎస్‌ఐ, సిఐగా పనిచేశారు. 2007లో ఎపిపిఎస్‌సి ద్వారా గ్రూప్-1లో ట్రెజరిశాఖలో ఎటిఒగా చేరారు. తెలంగాణలోని భువనగిరి, కృష్ణా జిల్లా డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టరుగా పనిచేశారు. డిప్యూటేషన్‌పై కృష్ణా జిల్లా ఎస్‌ఎస్‌ఎ ప్రాజెక్టు డైరెక్టరుగా పనిచేసిన ప్రసాద్ ప్రస్తుతం ఎపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఇన్సిట్యూషన్స్ సొసైటీ జాయింట్ డైరెక్టరుగా పనిచేస్తున్నారు. తన సర్వీసులో నిబంధనలకు విరుద్ధంగా ఏలూరులో రెండు ప్లాట్లు, విజయవాడలోని పోరంకిలో రెండు ప్లాట్లు, ఏలూరులోని మాదేపల్లిలో ఆర్‌సిసి ఇళ్లు, మాదేపల్లిలో మరో భవనం, హైదరాబాద్‌లో జిప్లస్-2 భవనం, పామర్రులో ప్లాట్, దెందులూరు మండలంలో 90 సెంట్ల వ్యవసాయ భూమిని గుర్తించారు. అలాగే మూడు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు, 500 గ్రాముల బంగారం, రూ.30 వేలు నగదు, రూ.15 లక్షలు విలువ చేసే ఎల్‌ఐసి పాలసీలు, మౌనిక ఆక్వా ఫామ్‌లో పెట్టుబడులు, ఇతరులకు వడ్డీలకు ఇచ్చిన రూ.26 లక్షలు విలువ చేసే ప్రామిసనరీ నోట్లను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రకాశం జిల్లా కొనకమిట్ల పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కె దీపిక, కానిస్టేబుల్ పి నరసింహారావును లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హెచ్‌ఎం పాడు మండలం, రాజగారి పల్లె గ్రామానికి చెందిన జి నరసింహా అతని కుటుంబ సభ్యుల నుండి 498 కేసు నుండి తొలగించేందుకు రూ.60 వేలను డిమాండ్ చేశారు. జి నరసింహా బుధవారం రూ.45 వేలను ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు.










