Jul 05,2022 13:15

గౌహతి : వేసవికాలంలో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి నేటికాలంలో ఏసీలు అనివార్యమౌతున్నాయి. వీటి వాడకానికి తగ్గట్టుగానే....దిమ్మతిరిగేలా వేలల్లో కరెంటు బిల్లులొస్తాయి. ఎండవేడిని తట్టుకోవడానికి ఎలాగోలా బిల్లులు కట్టుకోవచ్చులే అనుకుంటే.. నిరంతరాయంగా కరెంటు కోతలు కొనసాగుతాయి. ఇలాంటి సమయంలో ఏసీలే పనిచేయవు. ఈ సమస్యకు మూలం కరెంట్‌. అయితే అసలు కరెంటు లేకుండానే ఏసీలుంటే? ఎంతబాగుంటుందో కదూ..! సరిగ్గా ఈ ఆలోచన వచ్చిందో లేదో.. వెంటనే ఈ సమస్యకు పరిష్కారానికి పూనుకున్నారు గౌహతిలోని ఐఐటి శాస్త్రవేత్తలు. ఇంటి పైకప్పులకు.. రేడియేటివ్‌ కూలర్‌ పూత వేస్తే.. కరెంటు అవసరం లేకుండానే.. ఏసీలా చల్లదనంగా ఉంటుందట. ఇలాంటి విధానాలను 'పాసివ్‌ రేడియేటివ్‌ కూలింగ్‌' అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ac


ఈ పాసివ్‌ రేడియేటివ్‌ కూలింగ్‌ విధానం ద్వారా.. సమీప ప్రాంతాల నుంచి వేడిని గ్రహించి, దాన్ని మరలా పరారుణ రేడియోధార్మికత రూపంలో వాతావరణంలోకి విడుదల చేస్తాయి. ఆ రేడియో ధార్మికత.. భూ వాతావరణం గుండా ప్రయాణించి, చల్లగా ఉండే అంతరిక్షంలోకి చేరుతుంది. అయితే ఈ పాసివ్‌ రేడియేటివ్‌ కూలర్లు రాత్రివేళ మాత్రమే పనిచేస్తాయి. పగటి సమయంలో పనిచేయవు. మరి ఇవి పగటి సమయంలో కూడా ఉపయోగపడాలంటే.. ఈ కూలర్లు సౌర రేడియోధార్మికత మొత్తాన్నీ పరావర్తనం చెందించాలి. అయితే ఇప్పటివరకూ అభివద్ధి చేసినవి మాత్రం.. పగటి సమయంలో సరిపడా చల్లదనం అందించలేకపోతున్నాయని గౌహతి ఐఐటీ పరిశోధకుడు ఆశీష్‌ కుమార్‌ చౌదరి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాము సిలికాన్‌ డైఆక్సైడ్‌, అల్యుమినియం నైట్రైడ్‌లతో పలుచటి పొరలను అభివద్ధి చేశామన్నారు. ఈ పొరలు సౌర, వాతావరణ రేడియోధార్మికతను 97 శాతం పరావర్తనం చెందించాయని తెలిపారు. దీన్ని పైకప్పు పూతగా వాడటం వల్ల ఇంట్లో ఉష్ణోగ్రతలు.. వెలుపలి కన్నా 15 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గుతాయని పేర్కొన్నారు.
కాగా, పగటి సమయంలో పనిచేసే పాసివ్‌ రేడియేటివ్‌ కూలింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేయడం చాలా కష్టం. అయినా వారి పరిజ్ఞానంతో సాధ్యమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటివరకు ఉన్న సంప్రదాయ శీతల పరిజ్ఞానాలు.. వ్యర్థ వేడిని పరిసరాల్లోకి వెదజల్లుతాయి. రేడియేటివ్‌ కూలింగ్‌.. మిగులు వేడిని అత్యంత చల్లగా ఉండే అంతరిక్షంలోకి నేరుగా పంపడం ద్వారా భూమి మీద ఒక వస్తువును చల్లబరుస్తుంది. పగటి వేళ కూడా ఇది సమర్థంగా పని చేస్తుంది. కంప్యూటర్‌ ఆధారంగా ఈ సాంకేతికతను పరీక్షించాం'' అని ఐఐటీ గువాహటిలోని ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగ పరిశోధకుడు దేబబ్రత సిక్దర్‌ తెలిపారు.