Jun 13,2023 08:07

సంఘర్షణాత్మక ప్రాంతాల్లో పౌరుల జీవితాలు ఎంత దుర్లభంగా ఉంటాయో కాశ్మీరీ యువతి 23 ఏళ్ల ఇన్షా ముత్కా గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఇటీవల కాశ్మీరీ బోర్డు 12వ తరగతి పరీక్షల్లో ఆమె 73 శాతం మార్కులతో గ్రేడ్‌ ఎలో ఉత్తీర్ణత సాధించింది. ఫలితాలు వెలువడిన రోజు ఇన్షా ఇంటర్వ్యూ కోసం రిపోర్టర్లు క్యూ కట్టారు. ఎంతలా అంటే మాట్లాడి మాట్లాడి నీరసంతో కూలబడిపోయింది. ఆమెకేమీ నూరుశాతం మార్కులు రాలేదు.. అయినా ఎందుకు అంతమంది తన వెంటపడ్డారు? దానికి కారణం లేకపోలేదు..

2016లో తీవ్రవాద కార్యకలపాలు జరుపుతున్నాడని కమాండర్‌ బుర్హన్‌వాలీని కాశ్మీరీ జవాన్లు హతమార్చారు. ఆ హత్యకు నిరసనగా దక్షిణ కాశ్మీర్‌ షోపియన్‌ జిల్లా సిడౌ గ్రామంలో చెలరేగిన అల్లర్లను తన ఇంటి కిటికీ గుండా చూస్తున్న ఇన్షాపై జవానులు జరిపిన పెల్లెట్ల వర్షంలో ఆమె చూపు కోల్పోయింది. ఆ అల్లర్లలో కాశ్మీర్‌ వ్యాప్తంగా వేలాది పౌరులు పెల్లెట్ల గాయాలకు గురయ్యారు. ఈ చర్యను ప్రారంభించినప్పుడు పెల్లెట్స్‌ ప్రాణాంతకం కావని, ఘర్షణలు చెదరగొట్టేందుకు ఇంతకు మించిన గొప్ప ఆయుధం లేదని అధికారులు చెప్పారు. కాని ఈ పెల్లెట్ల గాయాలకు లక్షలాది కాశ్మీరీ పౌరులు చెవి, ముక్కు, దవడల గాయాలతో పాటు కంటిచూపును కోల్పోయి దుర్భర జీవితం గడుపుతున్నారు.

044

 

                                                                    ఆ రోజు ఏం జరిగింది..

2016 జులై 11 సాయంత్రంవేళ.. గ్రామంలో చెలరేగిన అల్లర్లను చూసేందుకు ఇన్షా కిటికీ తెరిచింది. అప్పుడే ఆమెను లక్ష్యం చేసుకున్న జవాన్ల బృందం ఆమెపై పెల్లెట్లతో దాడి చేసింది. 'కిటికీ తెరిచిన నాకు కింద నుండి జవాన్లు నాపై గురిపెట్టి ఉండడం కనిపించింది. భయంతో అలా నుంచొండిపోయాను. ఈలోపు ఏదో బలమైన వస్తువు నాకు తగిలినట్లు అనిపించి గట్టిగా అరుస్తూ పడిపోయాను. నా చుట్టూ అంతా చీకటిగా మారిపోయింది. ఆ తరువాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు' అంటూ ఆనాటి అనుభవాన్ని గుర్తు చేసుకుంది ఇన్షా. కిటికీ పక్కనే పడిపోయిన ఇన్షాను నేనే మొదట చూశాను. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ల ముందు కనపడుతోంది. నేలపై పడి ఉన్న ఇన్షా ముఖమంతా రక్తంతో తడిచిపోయింది. ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు' అంటూ ఇన్షా తల్లి అఫ్రోజా బాను ఆనాటి సంఘటనను చెబుతున్నప్పుడు ఆమె మాటల్లో దు:ఖం కనపడుతోంది.

55

                                                                    భూకంపం వచ్చినట్లైంది..

'ఇన్షాను అలా చూసేసరికి నా కాళ్ల కింద భూమి కంపించినట్లైంది. నా తల చుట్టూ ఉన్న వస్త్రాన్ని తీసి ముఖంపై కారుతున్న రక్తం తుడుస్తూ సాయం కోసం గట్టిగా కేకలు వేశాను. అప్పుడు కరెంటు కూడా లేదు. అంతా చీకటిగా ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే ఇన్షాను తీసుకుని జిల్లా ఆస్పత్రికి వెళ్లాం. డాక్టర్లు శ్రీనగర్‌ హాస్పటల్‌కు వెళ్లమన్నారు. ముఖమంతా రక్తం కారుతున్న నా బిడ్డను తీసుకుని 65 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాం. చాలా పెల్లెట్లు దిగడం వల్ల రక్తస్రావం ఆపలేకపోతున్నామని మాతో పాటు ఉన్న అంబులెన్స్‌ డాక్టర్లు చెప్పారు. రెండు గంటల తరువాత హాస్పటల్‌ చేరుకున్నాం. అక్కడికి చేరేసరికి పెల్లెట్ల గాయల బాధితులు వందల సంఖ్యల్లో ఉన్నారు. వారంతా నా కూతురు వయసువాళ్లే' అంటూ ఇప్పుడు ఆ సంఘటన గుర్తుచేసుకున్నా ఆమె కళ్లవెంట నీళ్లు కారుతున్నాయి.
 

                                                                         రెండేళ్ల తరువాత..

'పెల్లెట్లు మెదడుకు అతి దగ్గరగా కంటి కండరాలను చీల్చుకుంటూ వెళ్లాయని దీనివల్ల ఆమె చూపు కోల్పోయిందని డాక్టర్లు చెప్పారు. ఆ మాటలు నాకు గుండెపోటును తెచ్చాయి. ఇప్పుడు నా కూతురును ఎలా సముదాయించగలను? పెద్ద చదువులు చదువుకోవాలని ఎంతో ఆశపడింది. ఆ క్షణం ఆమె కలలన్నీ చెదిరిపోయినట్లుగా అనిపించింది' అంటూ చెబుతున్న అఫ్రోజా కూతురును కంటికి రెప్పలా కాపాడింది. చూపు కోల్పోయిన బాధతో ఆమె కుంగిపోకుండా ధైర్యం చెప్పింది. 'చూపు పోవడం నా కూతురు జీవితంలో పూడ్చలేని అగాథం. బిడ్డ పరిస్థితి చూసి పక్కకు వచ్చి ఏడ్చేదాన్ని. ఆమె ఎక్కడ తిరస్కారాలకు గురవుతోందోనని ఆ గాయాలతో చనిపోయినా బాగుండేది అని ఒక్కోసారి అనిపించేది. కాని ఆ పరిస్థితి నుండి నా కూతురు బయటపడింది. రెండేళ్ల తరువాత చదువు కొనసాగించింది. 10వ తరగతి పరీక్షల్లో కూడా మంచి మార్కులు వచ్చాయి' అని కూతురు సాధించిన విజయాలను ఆ తల్లి సంతోషంగా చెబుతోంది.
 

                                                                           చదువు కోసం..

పదో తరగతి పరీక్షా ఫలితాలు ఇచ్చిన ప్రోత్సాహంతో బ్రెయిలీ నేర్చుకుని పై చదువులు చదవాలని ఇన్షా నిశ్చయించుకుంది. కానీ అది అంత సులువు కాదు. మారుమూల గ్రామం నుండి నిపుణుడైన శిక్షకుడి దగ్గర నేర్చుకోవడం చాలా కష్టం. డ్రైవరుగా విధులు నిర్వర్తించే తండ్రి సంపాదనే ఆ కుటుంబానికి ఆధారం. దీంతో ఇన్షా చదువు ఆ కుటుంబానికి ఆర్థికంగా కూడా భారం. 'ఇప్పటికీ సరైన శిక్షకుడి దగ్గర నేర్చుకోలేక పోతున్నాను. దీంతో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అయినా నేను సివిల్స్‌ రాయాలని పట్టుదలగా ఉన్నాను. సివిల్స్‌ సాధించాక నాలాంటి బాధితులకు అండగా ఉంటాను' అంటోన్న ఇన్షా లాంటి ఎంతోమంది యువత కాశ్మీర్‌ వ్యాప్తంగా పెల్లెట్ల గాయాలతో దుర్భర జీవితం అనుభవిస్తున్నారు.

665


                                                            ఈ కొండలను తలకిందులు చేస్తానన్నారు..

'ఈ విజయం సాధించినందుకు మీరు ఎలా ఫీలవుతున్నారు?', 'దీనికి ఎవరు కారణం?', 'మీకు ఎవరు స్ఫూర్తి' వంటి ప్రశ్నలు రిపోర్టర్లు అడుగుతున్నప్పుడు స్థానిక రాజకీయ నాయకుడు ఒకరు ఇన్షా ఇంటికి వచ్చాడు. 'నువ్వు ఈ విజయం సాధించినందుకు కొండ కింద ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మా నాయకుడు అక్కడకు వస్తున్నారు. నువ్వు అక్కడకు రాగలవా? వస్తే.. నీకు మేం ఏం చేయగలమో చెప్తాం. దేశంలోనే ఉత్తమ కాలేజీలో సీటు వచ్చేలా చేస్తాం. నువ్వు మా ప్రాంతానికే గర్వకారణం' అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు. అప్పుడు ఇన్షా.. 'ఓ అన్నా గతంలో నేను సీనియర్‌ నాయకులను, రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులను, గవర్నరును కూడా కలిశాను. వాళ్లు చేయలేనిది మీ నాయకుడు ఏం చేస్తారు? ఇన్నేళ్లల్లో నేను ఎన్నో కష్టాలు పడ్డాను. నా చూపు పోయినప్పుడు ఎంతోమంది రాజకీయ నాయకులు నా దగ్గరకు వచ్చారు. ఈ కొండలను తలకిందులు చేసైనా నాకు సాయంగా నిలుస్తానన్నారు. కానీ నాకు సాయం అవసరమైనప్పుడు ఎవరూ అండగా నిలబడలేదు.. నేను అంధురాలిని కాదు.. నా కళ్లు దెబ్బతిని చూపు పోయింది' అన్న ఇన్షా మాటల్లో అంతరార్థాన్ని తెలుసుకున్న ఆ వ్యక్తి అక్కడ నుండి మౌనంగా నిష్క్రమించాడు.