ప్రజాశక్తి - ఎర్రగుంట్ల (కడప) : పట్టణ పరిధిలోని 11వ వార్డులో ఇల్లు కూలి మహిళ గాయాలపాలైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మొన్న కురిసిన వర్షాలకు మట్టి మిద్దె కావడంతో నెమెక్కి ఈరోజు ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇంటి యజమాని అయిన షేక్ మాబున్ని ప్రమాద సమయంలో ఇంటిలోనే ఉండడంతో ఇంటి పైకప్పు మీదపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి పైకప్పు కూలిన సమయంలో పెద్దగా శబ్దం రావడంతో పక్కనే ఉన్న వైసిపి నాయకుడు యూసఫ్ ఇతరుల సహాయంతో ఇంటిలో ఇరుక్కున్న మహిళను బయటకు తీశారు. గాయాలపాలైన మహిళను ప్రొద్దటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంటిలోని టీవీ, ఫ్రిడ్జ్, కూలర్ మొదలైన వస్తువులు పగిలిపోయాయని, సుమారు రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఆమె కూలీ పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తోందని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.










