Jun 30,2023 08:13

క అడవిలో సింహం, నక్క స్నేహంగా ఉండేవి. అయితే, ఇవి రెండూ స్నేహితులన్న విషయం మిగతా జంతువులకు, పక్షులకు తెలియదు. నక్క అడవిలోని జంతువులకు మాయమాటలు చెప్పి సింహం గుహ వైపు వెళ్లేలా పన్నాగం పన్నేది. అలా అనేక జంతువులను సింహానికి ఎరగా వేసేది. సింహం తినగా, మిగిలిన మాంసాన్ని అది తినేది.
ఒకరోజు కుందేలు వస్తుండగా నక్క చూసింది. దాని దగ్గరికి వెళ్లి 'అయ్యో మిత్రమా... నీ బిడ్డ చిట్టి కుందేలు ఇప్పుడే సింహం గుహ వైపు వెళ్లటం చూశాను. తొందరగా వెళ్లి కాపాడుకో' అని జాలిగా చెప్పింది. ఆ మాటలు నమ్మిన కుందేలు వేగంగా సింహం గుహ వైపు పరుగెత్తింది. బండరాయిపై కూర్చుని ఉన్న సింహం ఒక్క ఉదుటన కుందేలు మీదకి దూకి తినేసింది. 'మిత్రమా నీ తెలివి వల్ల ఈ రోజు రుచికరమైన ఆహారం దొరికింది' అన్నది సింహం. ఆ మాటలకు ఉప్పొంగి పోయింది నక్క.
చెట్టు పైన కూర్చున్న కోతి ఇదంతా గమనించసాగింది. కుందేలు సింహానికి బలవడం చూసి చాలా బాధపడింది. ఈ విషయాన్ని అడవిలోని జంతువులకు చెప్పింది. నక్కతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది.
ఒక రోజు కోతి సీతాఫల పండ్లను తింటూ చెట్టు కొమ్మపై కూర్చుని ఉంది. దానిని చూసింది నక్క., 'ఈరోజు ఎలాగైనా కోతి మాంసం తినాలి' అని మనసులో అనుకుంది. 'కోతి బావ... నువ్విక్కడ తీరిక పండ్లు తింటూ కూర్చున్నావు. నీ బిడ్డ సింహం గుహ వైపు వెళుతుంది. వెళ్లి కాపాడుకో' అన్నది. నక్క బుద్ధిని గ్రహించిన కోతి ఎలాగైనా దానికి గుణపాఠం చెప్పాలనుకుంది.
కోతి బండరాయి పక్కన బావికి దగ్గరగా నిల్చోని ఉంది. సింహం ఒక్క ఉదుటన దానిపై దూకింది. అప్రమత్తంగా ఉన్న కోతి చెంగున చెట్టు మీదికి ఎగిరింది. సింహం పట్టు తప్పి పక్కనే ఉన్న బావిలో జారి పడింది. పైకి రాలేక నీళ్లలో మునిగి చనిపోయింది. మిగిలిన జంతువులు నక్కను అడవి నుంచి తరిమేశాయి. కోతి తెలివికి జంతువులన్నీ సంబరపడిపోయాయి.

- షేక్‌ రిజ్వానా
9 వ తరగతి, జెడ్‌పిహెచ్‌ఎస్‌, మేళ్ళచెరువు.