Sep 23,2022 10:07

        ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం, విద్వేషపు మంటల్లో రాజకీయ లబ్ధి పొందటం బిజెపి ... మతోన్మాదంతో నేర్చుకున్న విద్య. ప్రజల దైనందిన జీవన సమస్యలను గాలికి వదిలేసి, విధానాల పరంగా తీవ్ర నష్టం కలిగించి, మతపరమైన ఉద్వేగాలతో ప్రజలను ముంచెత్తుతూ ఉంటుంది. అనేక రూపాల్లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర నష్టం కలిగించిన బిజెపి... విగ్రహ వివాదాలతో చిచ్చు రగలించాలని పలుమార్లు ప్రయత్నించింది. కానీ, ఆ కుయత్నాలను రాష్ట్ర ప్రజలు అనేక సందర్భాల్లో సరిగ్గానే అర్థం చేసుకున్నారు. అలాంటి చెత్త వ్యూహాలకు రాష్ట్రంలో చోటు లేదని చాలా స్పష్టంగా చాటిచెప్పారు.

A-trap-with-frenzy-a-trap-for-harmony


      హైదరాబాద్‌లో బిజెపి అగ్రనాయకుల సమావేశం జరిగిన కొద్ది రోజుల్లోనే - గుంటూరులోని జిన్నా టవర్‌పై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక ప్రకటన చేశారు. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరిట టవర్‌ ఉండటానికి వీల్లేదని, దాని పేరు మార్చాలని, లేకుంటే తాము కూల్చేస్తామని ప్రకటించాడు. దేశానికి స్వాతంత్య్రం రావటానికి ముందే ఒక చారిత్రిక సందర్భానికి గుర్తుగా 1942లో ఈ టవర్‌ని అప్పటి నాయకులు ఏర్పాటు చేశారు. దాని ప్రారంభ కార్యక్రమంలో కొండా వెంకటప్పయ్య, కాశీనాధుని నాగేశ్వరరావు, ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పాల్గొన్నారు. ఏడు దశాబ్దాలుగా ఎలాంటి వివాదాలూ లేని సామరస్య వాతావరణం గుంటూరులో ఉంది. బిజెపి ఎంత విద్వేష ప్రచారం చేసినా, ఎత్తులు పారలేదు. ప్రజల మద్దతు లభించలేదు. మూడు రంగులు అద్దుకున్న జిన్నా టవర్‌ చారిత్రక చిహ్నంగా వెలుగొందుతోంది.
       కోనసీమలోని అంతర్వేది రథం దగ్ధం ఉదంతాన్ని మత విద్వేష కుట్రగా ప్రచారం చేయటానికి బిజెపి పెద్దఎత్తున ప్రచారం చేసింది. కార్యకర్తలను సమీకరించి, ప్రదర్శనలు జరిపింది. ఆ సందర్భంగా కొందరు ఒక ప్రార్థనా మందిరం మీద దాడికి ఉపక్రమించారు. కానీ, సామాన్య ప్రజలెవ్వరూ దానిని ఇతర మతాల కుట్రగా చూడలేదు. గుర్తు తెలియని వ్యక్తులెవరో తేనెతుట్టెను తీసే ప్రయత్నంలో పెట్టిన మంట రథం దగ్ధానికి దారి తీసి ఉండొచ్చని పోలీసులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రథాన్ని సమకూర్చింది. దర్యాప్తు సిబిఐకి అప్పగించి ఏళ్లు దాటుతున్నా నివేదిక మాత్రం రాలేదు.
         విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసమైన సందర్భంలోనూ బిజెపి తీవ్ర ఆర్భాటం చేసింది. ''రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి తలను నరికేస్తాం'' అంటూ బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌ నాయుడు హెచ్చరించారు. సున్నితమైన అంశాల్లో తీవ్రమైన భావోద్వేగాలను రగల్చజూశారు. టిడిపి, జనసేన, వైసిపి కూడా ఈ వివాదంలో సామరస్య శైలిని అనురించకుండా- రాజకీయ విమర్శలతో పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చాయి. నిషేధం ఉన్నప్పటికీ పెళ్లి ముస్తాబు కారులో రామతీర్థం వెళ్లి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు తదితరులు రాద్ధాంతం సృష్టించారు. పొద్దుటూరులో టిప్పు సుల్తాన్‌ విగ్రహం ఏర్పాటుపైనా బిజెపి వివాదం రేపింది. కొత్త జిల్లాగా ఏర్పడిన కోనసీమ ప్రాంతానికి అంబేద్కర్‌ పేరు పెట్టడంపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, సామాజిక సామరస్యాన్ని దెబ్బ తీయటానికి ప్రయత్నించింది. ఇంకా అనేక చోట్ల విగ్రహాలు ప్రధాన అంశంగా గొడవలు రగిలించాలనుకొంది. అతికొద్ది మంది సంఘపరివార అనుయాయులు తప్ప సాధారణ ప్రజానీకం సంయమనం పాటించారు.

                                                             వాస్తవ సమస్యల విస్మరణ

రాష్ట్ర ప్రజలకు అవసరమైన ఏ ఒక్క అంశం మీదా బిజెపి సానుకూలంగా స్పందించ లేదు. తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ స్టీలుప్లాంటును అమ్మేస్తామని కేంద్ర ప్రభుత్వం బరితెగించి చెబుతోంది. రైల్వేజోను, పోలవరం, కడప ఉక్కు, వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలపై అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర నాయకులు అసలు మాట్లాడటం లేదు. పైగా రాష్ట్రానికి చాలా చేశామంటూ మొండి వాదనకు దిగి, అభాసు పాలవుతున్నారు. కానీ, ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బ తీసి, ఉన్మాదం రేగ్గొట్టటానికి మాత్రం సాకులు వెతికి మరీ కాషాయ శ్రేణులు రంగంలోకి దిగుతున్నాయి. బిజెపి విభజన, విద్వేష రాజకీయాలకు ప్రజలు మద్దతు ఇవ్వడం లేదు కానీ, వైసిపి, టిడిపి, జనసేన వాటి పట్ల మెతక, సానుకూల వైఖరిని అవలంబించి.. రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నాయి. కాషాయ కుట్రల పట్ల జనం అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం.

- సత్యాజీ